10 మంది ముస్లిం యువతులను పెళ్లి చేసుకోండి, ఉద్యోగం ఇప్పిస్తా: బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ వివాదాస్పద ప్రకటన

ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. ముస్లిం యువకులు మభ్యపెట్టి ఇద్దరు హిందూ మహిళలను బలవంతంగా మతం మార్పించి పెళ్లి చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో, సిద్ధార్థ్‌నగర్ జిల్లా దుమారియాగంజ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయిన రాఘవేంద్ర ప్రతాప్ సింగ్.. ధంఖర్‌పూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇద్దరు హిందూ మహిళలకు బలవంతంగా మత మార్పిడి చేసినందుకు బదులు, హిందూ యువకులు కనీసం 10 మంది ముస్లిం యువతులను తీసుకువచ్చి పెళ్లి చేసుకోవాలని సూచించారు.

రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ తన ప్రసంగంలో సంచలన ప్రకటన చేశారు. ఏ హిందూ యువకుడైనా ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే, తానే దగ్గరుండి ఆ వివాహాన్ని జరిపిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, వారికి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని, వివాహ ఖర్చులు, రక్షణ బాధ్యత అన్నీ తాను చూసుకుంటానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో అక్టోబర్ 16న జరిగిన పర్యటనకు సంబంధించినదైప్పటికీ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలు మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, వీటిపై సమాజ్‌వాదీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.

హిందువులు భయపడాల్సిన అవసరం లేదని, యూపీలో తమకు నచ్చింది ఏమైనా చేసుకోవచ్చని రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ ధైర్యం చెప్పారు. ఇది అఖిలేష్ యాదవ్ సమయం కాదని, తమ ప్రభుత్వం (యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం) అండగా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతాన్ని ‘మినీ పాకిస్తాన్’ అని పిలిచేవారని, యోగి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రజల్లో ఈ భయాందోళనలు తొలగిపోయాయని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ వ్యాఖ్యలు మతపరమైన అల్లర్లను సృష్టించే వ్యూహంలో భాగమేనని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే సయ్యదా ఖతూన్ ఖండించారు. ఈ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని, ప్రభుత్వం చర్య తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *