ఇండియన్ కోస్ట్ గార్డ్ సాహసం: అరేబియా సముద్రంలో ఇరాన్ మత్స్యకారుడి రక్షణ

అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ దళం (ICG) మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. కొచ్చి తీరానికి సుమారు 1,500 కిలోమీటర్ల దూరంలో తీవ్రంగా గాయపడిన ఇరాన్‌కు చెందిన ఒక జాలరిని ఐసీజీ నౌక ‘సచేత్’ సిబ్బంది అత్యంత చాకచక్యంగా రక్షించారు. ‘అల్-ఒవైస్’ అనే ఫిషింగ్ నౌకలో జనరేటర్‌కు ఇంధనం బదిలీ చేస్తుండగా పేలుడు సంభవించడంతో ఆ జాలరికి రెండు కళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో నౌక ఇంజిన్ కూడా ఫెయిల్ అవడంతో ఐదుగురు సిబ్బంది సముద్రంలో చిక్కుకుపోయారు.

ఈ ఘటనపై ఇరాన్‌లోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (MRCC) నుంచి ముంబైలోని MRCC కేంద్రానికి సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భారత అధికారులు అంతర్జాతీయ సేఫ్టీ నెట్‌ను యాక్టివేట్ చేసి, సమీపంలో ఉన్న నౌకలను అప్రమత్తం చేశారు. తూర్పు ఆఫ్రికా దేశాల పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న ఐసీజీ షిప్ సచేత్‌తో పాటు, కువైట్ నుంచి మొరోనీ వెళుతున్న మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ‘ఎంటీ ఎస్‌టీఐ గ్రేస్’ అనే ట్యాంకర్‌ను సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

తొలుత ‘ఎంటీ ఎస్‌టీఐ గ్రేస్’ ట్యాంకర్ ప్రమాదానికి గురైన నౌక వద్దకు చేరుకుని, ఐసీజీ వైద్య సిబ్బంది టెలీ-మెడికల్ మార్గదర్శకత్వంలో గాయపడిన జాలరికి ప్రథమ చికిత్స అందించింది. అనంతరం ఐసీజీ షిప్ సచేత్ అక్కడికి చేరుకుని బాధితుడిని తమ నౌకలోకి బదిలీ చేసింది. ప్రస్తుతం ఆ జాలరికి ఐసీజీ నౌకలోనే వైద్య చికిత్స అందిస్తున్నారని, మెరుగైన వైద్యం కోసం గోవాకు తరలిస్తున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశ సరిహద్దులకు ఆవల కూడా సముద్ర భద్రత, మానవతా సహాయం అందించడంలో ఐసీజీ నిబద్ధతకు ఈ సాహసోపేత ఆపరేషన్ నిదర్శనమని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *