అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2028లో ఉపాధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాన్ని తోసిపుచ్చారు. మలేషియా నుండి జపాన్ రాజధాని టోక్యోకు వెళ్తున్నప్పుడు విలేకరులతో మాట్లాడిన ట్రంప్, ఉపాధ్యక్ష పదవిపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, “ఇది చాలా తెలివైన పని అవుతుంది, ప్రజలు దీన్ని ఇష్టపడరు. ఇది సరైనది కాదు,” అని వ్యాఖ్యానించారు. “నేను ఉపాధ్యక్ష పదవిని చేపట్టాలని అనుకోవడం లేదు. ఇది ఒక జోక్ లాగా ఉంది. అమెరికా ప్రజలు దీన్ని అంగీకరించరు,” అని ఆయన స్పష్టం చేశారు. అయితే, వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంలో మాత్రం ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.
రాజ్యాంగ మార్పులపై ప్రచారం
డోనాల్డ్ ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి వీలుగా అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణను మార్చడానికి ప్రణాళికలు జరుగుతున్నాయని, ఆయన మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ ది ఎకనామిస్ట్‌తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ చాలాసార్లు తన ర్యాలీలలో ‘ట్రంప్ 2028’ టోపీలు ధరించి, సరదాగా మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని వ్యాఖ్యానించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం, ఒక వ్యక్తి రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్షుడిగా పనిచేసేందుకు అవకాశం ఉంది. ట్రంప్ తాను మూడోసారి అధ్యక్షుడిగా పదవి చేపట్టాలని ఇంకా ఆలోచించలేదని విలేకరులతో అన్నారు.
రిపబ్లికన్ పార్టీలో అనిశ్చితి
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలతో రిపబ్లికన్ పార్టీ భవితవ్యంపై కొంత అయోమయం ఏర్పడింది. 2028లో అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున బలమైన పోటీదారులుగా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మరియు విదేశాంగ మంత్రి మార్కో రూబియోలు మారగలరని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ ప్రకటనతో పార్టీలో చాలా మంది నాయకులు ఇప్పటికే 2028 ఎన్నికల కోసం ప్లాన్ చేసుకుంటుండగా, మరికొందరు ట్రంప్ మద్దతుదారులు ఆయన ఎక్కువ కాలం అధికారంలో ఉంటారని భావిస్తున్నారు. ట్రంప్ మాటల ప్రకారం చూస్తే, వచ్చే ఎన్నికల్లో జేడీ వాన్స్, మార్క్ రుబియోలు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో నిలిచే అవకాశాలున్నాయి.