ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. పక్కటెముకలకు గాయం కావడంతో నొప్పితో విలవిల్లాడిన అయ్యర్‌ను సిడ్నీలోని ఆసుపత్రిలో చేర్చారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఆయనకు అంతర్గత రక్తస్రావం (Internal Bleeding) అవుతుండటంతో ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో చికిత్స అందిస్తున్నారు. అయ్యర్ మొదట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. క్యాచ్ పట్టే క్రమంలో కిందపడినప్పుడు పక్కటెముకలకు గాయం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం, అంతర్గత రక్తస్రావం జరుగుతుండటం వల్ల ఇన్‌ఫెక్షన్ సోకకుండా నివారించడానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయ్యర్‌ను రెండు నుంచి ఏడు రోజుల పాటు వైద్య పర్యవేక్షణలో (అబ్జర్వేషన్‌లో) ఉంచుతారని సమాచారం. క్యాచ్ పట్టిన సమయంలో అయ్యర్ శరీర ఉష్ణోగ్రత, పల్స్ రేట్, బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‌లో లేవని, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది స్పష్టంగా కనిపించిందని తెలుస్తోంది. దీంతో బీసీసీఐ మెడికల్ టీమ్ ఆయన్ను వెంటనే ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించింది.
అంతర్గత రక్తస్రావం కారణంగా అయ్యర్ కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని మెడికల్ నిపుణులు భావిస్తున్నారు. అయ్యర్ మళ్లీ ఎప్పుడు బ్యాట్ పడతాడో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది. మరికొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండి, పూర్తిగా కోలుకున్న తర్వాతే భారతదేశానికి తిరిగి రానున్నాడు. ఈ పరిణామంతో అయ్యర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. అయ్యర్‌ను ఆస్ట్రేలియాతో జరగబోయే 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు సెలక్షన్ కమిటీ ఎంపిక చేయలేదని తెలిసిందే.