12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) రేపట్నుంచే ప్రారంభం

దేశవ్యాప్తంగా రెండు దశాబ్దాల తర్వాత పెద్ద ఎత్తున సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియకు ఎన్నికల సంఘం (ECI) శ్రీకారం చుట్టింది. రెండో దశలో భాగంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ అక్టోబర్ 28 నుంచి ప్రారంభం కానున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. డూప్లికేట్ పేర్లు, మరణించిన ఓటర్లు, అర్హత లేని వారి పేర్లను తొలగించి, ‘క్లీన్ లిస్టులు’ తయారు చేయడమే ECI లక్ష్యం. ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలు అర్థరాత్రి నుంచి ఫ్రీజ్ అవుతాయి.

SIR ప్రక్రియ ప్రారంభమయ్యే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు: అండమాన్ & నికోబార్ ఐలాండ్స్, గోవా, పుదుచ్చేరి, చత్తీస్‌ఘడ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మరియు లక్షద్వీప్. ఈ రాష్ట్రాల్లో మంగళవారం నుంచి బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) ప్రతి ఇంటికీ మూడుసార్లు వెళ్లి ప్రీ-ఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫారమ్‌లు పంచుతారు. 2003 ఓటర్ల లిస్టులో పేర్లు ఉన్నవారికి అదనపు డాక్యుమెంట్లు అవసరం లేదు.

ఈ సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా, ఆధార్ కార్డు కేవలం గుర్తింపు ప్రూఫ్‌గా మాత్రమే పరిగణించబడుతుందని (బీహార్ మోడల్ ప్రకారం) CEC తెలిపారు. పౌరసత్వానికి ఆధార్ కార్డు గుర్తింపు కాదని ECI స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ అంతా పూర్తి అయిన తర్వాత, వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఈ ప్రక్రియను వివరించడానికి మంగళవారం రోజున అన్ని చీఫ్ ఎలక్షనల్ ఆఫీసర్లు మరియు జిల్లా ఆఫీసర్లు రాజకీయ పార్టీలతో సమావేశమై SIR ప్రాసెస్‌ను వివరిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *