ఒకవైపు భారతదేశంతో స్నేహపూర్వక వాతావరణాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు చైనా సరిహద్దుల్లో భారీగా ఆయుధ వ్యవస్థను మోహరిస్తోంది. గల్వాన్ లోయకు అతి సమీపంలో, టిబెట్‌లోని పాంగాంగ్ సరస్సు తూర్పు వైపున చైనా ఒక కొత్త గగన రక్షణ సముదాయాన్ని (ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్‌ను) నిర్మిస్తోంది. ఇందులో క్షిపణి ప్రయోగ కేంద్రాలు, విస్తృతమైన మౌలిక సదుపాయాలు ఉండటం వల్ల ఈ నిర్మాణం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన విశ్లేషకుల ప్రకారం, ఈ కాంప్లెక్స్‌లో భారీ కమాండ్ అండ్ కంట్రోల్ భవనాలు, బ్యారక్‌లు, వాహనాలు నిలిపి ఉంచే షెడ్లు, ఆయుధ నిల్వ గోదాములు మరియు రాడార్ సిస్టమ్‌లు ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, చైనా తన దీర్ఘశ్రేణి HQ-9 సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి (SAM) వ్యవస్థలను దాచి ఉంచేందుకు వీలుగా భారీ బంకర్ వంటి భవనాలను నిర్మిస్తోంది. శత్రువుల నిఘాకు దొరకకుండా, అలాగే ఎదురుదాడి నుంచి తమ క్షిపణి వ్యవస్థలను రక్షించుకోవడానికి ఈ బంకర్ భవనాలను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నిర్మాణాలు 2020లో భారత్-చైనా సైనికుల ఘర్షణ జరిగిన గల్వాన్ లోయ ప్రాంతానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. సెప్టెంబర్ 29వ తేదీన తీసిన శాటిలైట్ చిత్రాల్లో కొన్ని బంకర్ భవనాల పైకప్పులు క్షిపణి ప్రయోగానికి అనువుగా తెరిచి ఉండటం గమనించబడింది. చైనా ఒకవైపు భారతదేశంతో స్నేహం గురించి చర్చిస్తూనే, మరోవైపు సరిహద్దుల్లో భారీ సైనిక నిర్మాణాలు చేపట్టడం వ్యూహాత్మకంగా చర్చనీయాంశంగా మారింది. భారత ప్రభుత్వం చైనా వ్యవహారంపై ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.