ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పహల్గామ్ ఘటన తర్వాత భారత్ సింధూ నదీ జలాలను నిలిపివేసిన తరహాలోనే, ప్రస్తుతం అఫ్గనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం కూడా అదే దారిలో పయనిస్తోంది. పాకిస్థాన్‌కు నీటి సరఫరాను నిలిపివేయడానికి వీలుగా తమ దేశంలో ప్రవహించే కునార్ నదిపై సాధ్యమైనంత త్వరగా ఆనకట్టలు నిర్మించాలని తాలిబన్లు నిర్ణయించారు. ఈ మేరకు తమ సుప్రీం నేత మౌలావి హిబతుల్లా అఖుంద్జాదా ఉత్తర్వులు జారీచేశారని తాలిబాన్ నీటిపారుదల శాఖ మంత్రి ముల్లాహ్ అబ్దుల్ లతీఫ్ మన్సూర్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ప్రకటించారు.
“అఫ్గన్‌కు తన స్వంత నీటిని వినియోగించుకునే హక్కు ఉంది” అని తాలిబన్ మంత్రి స్పష్టం చేశారు. ఈ డ్యామ్‌ల నిర్మాణ పనులను దేశీయ సంస్థలే చేపడతాయని తెలిపారు. తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ)కు తాలిబన్లు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో తాలిబన్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 500 కి.మీ. పొడవైన కునార్ నది, పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని హిందూ కుష్ పర్వతాలలో జన్మించి, అఫ్గన్‌లోకి ప్రవేశించి తిరిగి పాక్‌లోకి ప్రవహిస్తుంది.
కునార్ నదిపై అఫ్గన్ ఆనకట్టలు నిర్మిస్తే, ఇప్పటికే భారత్ సింధూ నదీ జలాలను నిలిపివేయడం వల్ల నీటి కొరతతో ఉన్న పాకిస్థాన్ మరింత కష్టాల్లోకి కూరుకుపోవడం ఖాయం. అత్యంత ముఖ్యంగా, భారత్-పాక్ మధ్య ఉన్నట్లుగా ఈ రెండు దేశాల మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం లాంటిది లేకపోవడం వల్ల, అఫ్గన్‌పై ఒత్తిడి తెచ్చి వెనక్కి తగ్గించడానికి పాక్‌కు తక్షణ చట్టపరమైన మార్గం లేదు. ఇది పాక్-అఫ్గన్ మధ్య ఘర్షణలు మరింత తీవ్రమయ్యే ప్రమాదాన్ని పెంచుతోంది. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత, నదులపై దృష్టి సారించి ఆహార భద్రత కోసం డ్యామ్‌లు, కాలువలు నిర్మిస్తున్నారు. ఉత్తర అఫ్గన్‌లో నిర్మాణంలో ఉన్న వివాదాస్పదమైన ఖోష్ టేపా కాలువ కూడా దీనిలో భాగమే.