తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని డీసీసీ అధ్యక్షుల నియామకంపై కీలక చర్చల కోసం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు (అక్టోబర్ 25, శనివారం) మధ్యాహ్నం మూడు గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే సమావేశంలో ఆయన పాల్గొంటారు. తెలంగాణతో పాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికను కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఈ ముఖ్య సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా పాల్గొంటారు. రాష్ట్రంలో ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకునేందుకు ఏఐసీసీ ఇప్పటికే సీనియర్ నాయకులను అబ్జర్వర్లుగా నియమించింది. ఇవాళ సాయంత్రమే వీరంతా ఢిల్లీకి బయలుదేరనున్నట్లు సమాచారం.
జిల్లా అధ్యక్ష పదవుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో, ఈ నెల నెలాఖరున డీసీసీ అధ్యక్షులను ప్రకటించేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, తుది అభ్యర్థుల ఎంపికపై ఖర్గేతో రేవంత్‌రెడ్డి బృందం ప్రధానంగా చర్చించనుంది.