పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య రావల్పిండిలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ తరపున 39 ఏళ్ల స్పిన్నర్ ఆసిఫ్ అఫ్రిది టెస్ట్ అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే ఆసిఫ్ అఫ్రిది అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో 92 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. టెస్ట్ అరంగేట్రంలో ఐదు వికెట్లు తీసిన అత్యంత పెద్ద వయసున్న బౌలర్‌గా ఆసిఫ్ నిలిచాడు.
ఆసిఫ్ అఫ్రిది ఈ ఘనతను 38 సంవత్సరాల 301 రోజుల వయస్సులో సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతను 6 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు, అత్యధిక వయస్సులో అరంగేట్ర టెస్టులో 5 వికెట్లు తీసిన రికార్డు ఇంగ్లాండ్‌కు చెందిన చార్లెస్ మరియట్ పేరిట ఉండేది. మరియట్ 1933లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 సంవత్సరాల 332 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించాడు.
కాగా, ఆసిఫ్ అఫ్రిది పాకిస్తాన్ తరపున టెస్ట్ క్రికెట్‌లో రెండో అత్యధిక వయస్సులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో మిరాన్ బక్ష్ ఉన్నారు. ఆయన 1955లో టీమ్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో 47 సంవత్సరాల 284 రోజుల వయస్సులో అరంగేట్రం చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం ఓటమి అంచున ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ మొత్తం ఆధిక్యం కేవలం 23 పరుగులు మాత్రమే ఉంది.