హైదరాబాద్ : కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠినతర లాక్ డౌన్ అమలు చేస్తున్న వేల , జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా నివారణ చర్యల్లో పాల్పంచుకుంటూ పోరాడుతున్న పలు విభాగాల్లోని అధికారులు, ఉద్యోగులకు కూడా కోతల్లేకుండా పూర్తి జీతాలు ఇవ్వనున్నారు. ప్రభుత్వం పోలీసు, వైద్య ఆరోగ్యశాఖలతో పాటు జీహెచ్‌ఎంసీలో క్షేత్రస్థాయిలో పనిచేసే పారిశుధ్య కార్మికులు, తదితర విభాగాల్లోని సిబ్బందికి సైతం ఎలాంటి కోతల్లేకుండా పూర్తి జీతాలతో పాటు వారి శ్రమను గుర్తించి ప్రోత్సాహకం ప్రకటించడం తెలిసిందే.. వారితోపాటు జీహెచ్‌ఎంసీలోని ఇంకా ఎందరో కరోనా నివారణలో పడుతున్న శ్రమను గుర్తించి వారికి కూడా పూర్తి వేతనాలు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. వీరిలో ఆరోగ్యం, పారిశుధ్యం విభాగంలో పనిచేస్తున్న ఏఎంఓహెచ్‌లు, మెడికల్ ఆఫీసర్లు, చీఫ్‌మెడికల్ ఆఫీసర్, చీఫ్ ఎంటమాలజిస్ట్, సీనియర్ ఎంటమాలజిస్టులు, ఈవీడీఎం విభాగంలోని క్షేత్రస్థాయి అధికారులు, రవాణా విభాగం వారు, పారిశుధ్యంతో సంబంధం ఉన్న ఇతరత్రా అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఈ విభాగాల్లోని రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అందరికీ కోతల్లేని పూర్తివేతనం ఇవ్వనున్నారు.
జీహెచ్‌ఎంసీలో పారిశుధ్యం, ఎంటమాలజీ, ఈవీడీఎం విభాగంలో క్షేత్రస్థాయిలో పనిచేసే దిగువస్థాయి సిబ్బందితోపాటు ఎందరో ఉద్యోగులు, అధికారులు సైతం కరోనా నివారణకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ వారితో కలిసి నగరంలో కరోనా నివారణకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా కంటైన్మెంట్ ప్రాంతాల్లో కట్టడి అమలుకు, ఇంటింటికీ అవసరమైన మందులు, నిత్యావసరాల పంపిణీ, ఇతరత్రా చర్యలకు ఎంతో కృషి చేస్తున్నారు. వీటితోపాటు వలస కార్మికులు, అనాథలను గుర్తించి వసతి, ఆకలితో అల్లాడుతున్న వారికి భోజనం తదితర సదుపాయాలు కల్పిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలోని అధికారుల జీతాల పూర్తి చెల్లింపు వల్ల ప్రభుత్వానికి ఎలాంటి భారం ఉండదు. జీహెచ్‌ఎంసీ ఖజానా నుంచే వీరికి జీతాలు చెల్లిస్తారు. ఖజానా భర్తీకి ఆస్తిపన్ను వసూళ్లు తదితర ఫీజులు రాబట్టేదీ జీహెచ్‌ఎంసీయే కాబట్టి ప్రభుత్వం ఒక ఆదేశం లేదా ఉత్తర్వు జారీ చేస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తారని, ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.