డ్రగ్స్ ఓవర్‌డోస్‌ వల్లే కొడుకు మృతి: హత్య కేసులో పంజాబ్ మాజీ డీజీపీ సంచలన ప్రకటన

పంజాబ్ మాజీ డీజీపీ మొహమ్మద్ ముస్తఫా, ఆయన భార్య మాజీ మంత్రి రాజియా సుల్తానాపై వారి కుమారుడు అఖిల్ అక్తర్ (35) హత్య కేసులో హరియాణాలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అక్టోబర్ 16న అఖిల్ మృతి చెందగా, అక్టోబర్ 20న ఒక రాజకీయ పార్టీ కార్యకర్త షమ్సుద్దిన్ చౌదరీ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదులో అఖిల్ రికార్డు చేసిన ఓ వీడియోను ప్రస్తావించారు, అందులో అఖిల్ “నన్ను నా కుటుంబం తప్పుడు కేసులో ఇరికించబోతోంది, నన్ను జైలుకి పంపాలన్నదే లేదా చంపాలన్నదే వారి ప్లాన్” అని పేర్కొనడం గమనార్హం.

తనపై వస్తున్న ఆరోపణలను మాజీ డీజీపీ మొహమ్మద్ ముస్తఫా తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు అఖిల్ గత 18 ఏళ్లుగా మాదకద్రవ్యాలకు బానిసై, తీవ్ర మానసిక రుగ్మతలతో బాధపడ్డాడని తెలిపారు. “ప్రాథమిక పోలీస్ దర్యాప్తు ప్రకారం, అఖిల్ అధిక మోతాదులో బుప్రినార్ఫిన్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత మృతి చెందాడు. 2007 నుంచి పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నా మారలేదు. ఒకసారి మా ఇంటికే నిప్పుపెట్టాడు” అని ముస్తఫా జాతీయ మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు.

ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆప్ పార్టీ ఎమ్మెల్యేకు గతంలో వ్యక్తిగత సహాయకుడిగా పని చేశాడని ముస్తఫా ఆరోపించగా, ఫిర్యాదుదారుడు షమ్సుద్దిన్ చౌదరీ మాత్రం తనకు అఖిల్ మరణంపై అనుమానం కలగడంతోనే ఫిర్యాదు చేశానని, ఎవరిపైనా ప్రత్యక్ష ఆరోపణలు చేయలేదని స్పష్టం చేశారు. అఖిల్ మృతదేహం నుంచి తీసిన విసెరా శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపగా, దాని నివేదిక రావడానికి 2-3 నెలలు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలోని సిట్ ఈ కేసును విచారిస్తోంది. ముస్తఫా కుటుంబం మాత్రం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే తమపై కేసు నమోదు చేశారని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *