కాకినాడ జిల్లా తుని రూరల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థినిపై జరిగిన అత్యాచార యత్నం ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ సీరియస్‌గా స్పందించారు. ఈ ఘటనపై తాను షాక్‌కు గురైనట్లు ట్వీట్ చేశారు. ఈ అమానుషానికి పాల్పడిన తాటిక నారాయణరావు అనే వ్యక్తిని పోలీసులు వెంటనే పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారని ఆయన వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడిన వాడు ఎవరైనా సరే ఉక్కుపాదంతో అణచివేస్తామని నారా లోకేష్ తీవ్రంగా హెచ్చరించారు.
బాధితురాలైన బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి, అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినులకు పటిష్టమైన భద్రత కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనకు పాల్పడిన తాటిక నారాయణరావు స్థానిక టీడీపీ నాయకుడని, గతంలో తుని మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా కూడా పనిచేశాడని వార్తలు వచ్చాయి.
తాతయ్యనని చెప్పి బాలికను స్కూలు నుంచి బయటకు తీసుకెళ్లగా, ఒక యువకుడు సపోట తోటలో వారిని చూసి వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్ కావడంతో గ్రామస్థులు నారాయణరావును చితకబాది పోలీసులకు అప్పగించారు. మరోవైపు, బయటి వ్యక్తితో బాలికను ఎలా బయటకు పంపించారని బాలిక కుటుంబసభ్యులు, గ్రామస్థులు గురుకుల పాఠశాల హెడ్మాస్టర్‌ను నిలదీశారు. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ స్పందించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.