రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళ పర్యటన సందర్భంగా కొచ్చిలోని ప్రమాదోం స్టేడియంలో ఆమెను తీసుకెళ్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత అనూహ్య ఘటన జరిగింది. హెలిప్యాడ్ టార్మాక్‌లో కొంత భాగం అకస్మాత్తుగా కుంగిపోయింది. ఈ ఘటన భద్రతా ప్రోటోకాల్స్ మధ్య వెలుగులోకి వచ్చింది. శబరిమల ఆలయ దర్శనం కోసం రాష్ట్రపతి కేరళ చేరుకోగా, హెలికాప్టర్ బరువును తట్టుకోలేకపోవడం వల్ల హెలిప్యాడ్ కుంగిపోయినట్లు సమాచారం. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో రాష్ట్రపతి ముర్ము హెలికాప్టర్ లోపల లేరు.
అకస్మాత్తుగా తలెత్తిన ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అక్కడే ఉన్న పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. వారంతా కలిసి అప్రమత్తంగా వ్యవహరించి, హెలికాప్టర్‌ను కుంగిన ప్రదేశం నుంచి భౌతికంగా తోసి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది, భద్రతా సిబ్బంది చురుకుదనం కారణంగా పెద్ద ప్రమాదం తప్పిందని తెలుస్తోంది.
రాష్ట్రపతి సచివాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 21 నుండి 24 వరకు కేరళ పర్యటనలో ఉన్నారు. ఆమె అక్టోబరు 22న శబరిమల ఆలయాన్ని దర్శించుకుని, హారతిలో పాల్గొననున్నారు. ఈ ఘటన తర్వాత రాష్ట్రపతి ముర్ము రాజ్‌భవన్ నుంచి శబరిమల దర్శనం కోసం బయలుదేరారు.