కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) మూడోసారి గెలిచినప్పటికీ, మంత్రి పదవి దక్కకపోవడం, ఏడాదిన్నరలోనే ఇంటా, బయటా అసమ్మతి పెరిగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తనను వ్యతిరేకించే నాయకులు “బోల్తా పడిందిలే బుల్ బుల్ పిట్ట” అంటూ పాటలు పాడుకుంటున్నారనే చర్చ నగరంలో జరుగుతోంది. తాను ఒకటి అనుకుంటే మరొకటి జరిగిపోతోందని ఆయన అనుచరులు వాపోతున్నారు. ముఖ్యంగా, గతంలో కాకినాడ కమిషనర్ భావన (ఐఏఎస్)ను బదిలీ చేయించడంలో విజయం సాధించినా, కార్పొరేషన్ కాలపరిమితి ముగియడంతో ప్రభుత్వం తిరిగి జిల్లా కలెక్టర్ షామ్మోహన్‌నే ప్రత్యేక అధికారిగా నియమించింది. ఐఏఎస్ అధికారి తనకు అనుకూలంగా ఉండరని పంతం పట్టి కమిషనర్‌ను బదిలీ చేయిస్తే, చివరకు మళ్లీ ఐఏఎస్ అధికారి చేతికే కార్పొరేషన్ పగ్గాలు రావడం కొండబాబుకు ప్రధాన చుక్కెదురుగా మారింది.
ప్రస్తుతం కలెక్టర్ షామ్మోహన్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో మంచి అనుబంధం ఉండటంతో, ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలు త్వరగా ఆయన దృష్టికి వెళ్తాయనే ఆందోళన కొండబాబు వర్గంలో ఉంది. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యేపై అంతర్గత అసమ్మతి కూడా పెరిగిపోయింది. సొంత సోదరుడి కుమారుడు ఉమాశంకర్ తన వర్గాన్ని పెంచుకుంటూ పక్కలో బల్లెంలా మారారు. పొత్తులో ఉన్న జనసేన నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. జనసేనకు చెందిన మత్స్యకారులు తమను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేపై భగ్గుమంటున్నారు. అంతేకాక, జనసేన కాకినాడ ఇంచార్జ్, పౌరసరఫరాల శాఖ చైర్మన్ తోట సుధీర్, ఎమ్మెల్యేను కాదని ఆలయ చైర్మన్ పదవిని కూడా దక్కించుకుని నేరుగా విభేదిస్తున్నారు. పొత్తు ధర్మంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఎమ్మెల్యే కార్యక్రమాలకు హాజరుకాకపోవడంతో, కొండబాబు ఒంటరి అయ్యారన్న భావన రాజకీయ వర్గాల్లో ఉంది.
మరో ముఖ్య పరిణామం ఏమిటంటే, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ టీడీపీలో చేరడం. సామాజిక ఉద్యమాలలో కీలకంగా ఉన్న ఆమె, ఎమ్మెల్యేను వ్యతిరేకించేవారికి పెద్ద దిక్కుగా మారారు. మరోవైపు, వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మళ్లీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ, కూటమికి సవాళ్లు విసురుతున్నారు. గతంలో చంద్రశేఖర్ రెడ్డిపై లక్షల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చేసిన కొండబాబు, ఇప్పుడు వాటిపై విచారణ చేయించకపోవడం పట్ల మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఈ అన్ని కారణాల వల్ల, కాకినాడకు అన్ని తానై వ్యవహరించాలని భావిస్తున్న ఎమ్మెల్యే కొండబాబు ఆశలన్నీ అడియాశలవుతున్నాయని, రానున్న మూడేళ్లు ఆయనకు కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.