త్రివిక్రమ్-వెంకటేష్ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక: పుట్టినరోజు సందర్భంగా అధికారిక ప్రకటన

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రంలో కథానాయికగా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్టుగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో, శ్రీనిధి శెట్టిని కథానాయికగా తీసుకున్నట్టు ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. వెంకటేష్‌కు ఇది 77వ చిత్రం.

త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే స్పెషల్ క్రేజ్ నెలకొంది. గతంలో త్రివిక్రమ్ రచనలో వెంకటేష్ నటించిన చిత్రాలు సున్నితమైన హాస్యం, కుటుంబ విలువలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, త్రివిక్రమ్ సినిమాల్లో కథానాయికలకు కేవలం పాటలకు, కొన్ని సన్నివేశాలకే పరిమితం చేయకుండా కథలో ప్రాముఖ్యత ఇస్తారు. అందువల్ల, ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు అవుతుందని చెప్పవచ్చు.

రాకింగ్ స్టార్ యశ్ ‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న శ్రీనిధి శెట్టి, తమిళంలో చియాన్ విక్రమ్ సరసన ‘కోబ్రా’లో నటించారు. తెలుగులో న్యాచురల్ స్టార్ నానితో ‘హిట్ 3’ ద్వారా పరిచయమై, దీపావళికి విడుదలైన ‘తెలుసు కదా’ సినిమాలోనూ నటించారు. తాజాగా ఈ చిత్రానికి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. శ్రీనిధి శెట్టి ఇప్పటికే షూటింగ్‌లో జాయిన్ అయ్యారని సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఇది ప్రొడక్షన్ 8వ చిత్రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *