ఆసియా ప్రాంతంలో విమాన ప్రమాదాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో, హాంగ్‌కాంగ్‌లో (Hong Kong) మరో దుర్ఘటన చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి బయలుదేరిన బోయింగ్ 747 కార్గో విమానం (Emirates SkyCargo Flight EK9788) హాంగ్‌కాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Hong Kong International Airport) లో ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. ఉత్తర రన్‌వే 07R పై ల్యాండ్ అవుతుండగా, విమానం అకస్మాత్తుగా ఎడమ వైపు తిరిగి వేగంగా పరిగెత్తి, రన్‌వేపై నుంచి అదుపు తప్పి పక్కన ఉన్న గ్రౌండ్ సర్వీస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాత విమానం ముందు భాగం సముద్రపు గోడను దాటి నీటిలోకి జారిపోయింది.
టర్కీకి చెందిన ఎయిర్ ఏసీటీ (Air ACT) నిర్వహణలో ఉన్న ఈ ఎమిరేట్స్ కార్గో విమానం దుబాయ్‌లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హాంగ్‌కాంగ్‌కు వస్తుండగా సోమవారం తెల్లవారుజామున సుమారు 3:53 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఊహించని ప్రమాదం వల్ల గ్రౌండ్ సర్వీస్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. వాహనంలో ఉన్న ఇద్దరు ఉద్యోగులు మరణించారు – ఒకరు సంఘటనా స్థలంలోనే, మరొక 41 ఏళ్ల ఉద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, విమానంలో ఉన్న నలుగురు సిబ్బందికి మాత్రం స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి.
ప్రమాదం తరువాత హాంగ్‌కాంగ్ ఎయిర్‌పోర్టు అధికారులు ఉత్తర రన్‌వేను (Runway) తాత్కాలికంగా మూసివేశారు. ఫైర్ సర్వీస్, మెరైన్ పోలీసులు శిథిలాలను తొలగించే పనులు చేపట్టారు. విమానం ట్రాకింగ్ డేటా ప్రకారం ల్యాండింగ్ సమయంలో దిశ అకస్మాత్తుగా మారడం గమనార్హం. ప్రమాదానికి గల నిజమైన కారణాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, అధికారులు బ్లాక్‌బాక్స్‌ను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన కారణంగా విమానాశ్రయం కార్యకలాపాలకు తాత్కాలికంగా అంతరాయం కలిగింది, అదే రన్‌వేపై ల్యాండ్ అవ్వాల్సిన విమానాలను అత్యవసరంగా దక్షిణ రన్‌వేకు మళ్లించారు.