పంచాయతీ కార్యదర్శులకు మంత్రి సీతక్క శుభవార్త

తెలంగాణ పంచాయత్ సెక్రటరీస్ ఫెడరేషన్ ప్రతినిధులు తమ చిరకాల సమస్యల పరిష్కారం కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో ప్రజాభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రధానంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ (Regularization), వారికి ప్రొబేషన్ డిక్లరేషన్ ఇవ్వడం మరియు ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి, అందులో ఉన్న OPS (Outsourced Panchayat Secretaries)లను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించాలని కోరారు. దశాబ్ద కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న తమ డిమాండ్లపై మంత్రి దృష్టిని ఆకర్షించారు.

|ఇతర డిమాండ్లు, మంత్రి సానుకూల స్పందన

ఫెడరేషన్ ప్రతినిధులు స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన 98 మంది అభ్యర్థులను తక్షణమే విధుల్లోకి తీసుకోవడం, గత 16 రోజుల సమ్మె కాలాన్ని సర్వీస్‌గా పరిగణించడం, వైద్య బిల్లుల త్వరిత క్లియరెన్స్ వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. వారి వినతికి మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించి, న్యాయమైన పరిష్కారాన్ని చూపించడానికి ప్రభుత్వం నిబద్ధతతో ఉందని హామీ ఇచ్చారు. గతంలో రూ. 104 కోట్ల బిల్లులు విడుదల చేయించడం వంటి కీలక నిర్ణయాలకు మంత్రికి కార్యదర్శులు కృతజ్ఞతలు తెలిపారు.

|అధికారులకు ఆదేశాలు, త్వరలో తుది నిర్ణయం

పంచాయతీ కార్యదర్శులు వివరించిన అంశాలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజనను ఆదేశించారు. అంతేకాక, త్వరలోనే పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, అన్ని అంశాలపై ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ సానుకూల స్పందనతో కార్యదర్శులు మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *