శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న రెండవ ప్రాజెక్టులో నటుడు శివాజీ, లయ జంటగా నటించనున్నారు. సుధీర్ శ్రీరామ్ రచన, దర్శకత్వంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా శివాజీ మరోసారి ఈటీవీ విన్‌తో కలిసి పనిచేయనున్నారు. 90’s వెబ్ సిరీస్‌లో శివాజీతో కలిసి నటించిన బాలనటుడు రోహన్‌తో పాటు అలీ, ధనరాజ్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రంలో శివాజీ ‘పంచాయతీ సెక్రెటరీ శ్రీరామ్’ పాత్రలో కనిపించనున్నారు. శ్రీరామ్ ఎంతో నిజాయితీపరుడు, తప్పును సమర్థించని, అన్యాయాన్ని సహించలేని మనస్తత్వం కలవాడు. తన వల్ల గానీ, ఇతరుల వల్ల గానీ జనం ఇబ్బంది పడకూడదని ఆలోచించే వ్యక్తి. భార్యబిడ్డలే తన ప్రపంచంగా భావించి, వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి. వారి కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి వెనుకాడని వ్యక్తిగా శ్రీరామ్ పాత్రను తీర్చిదిద్దారు.
దీపావళి పండుగ సందర్భంగా ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌ను బట్టి చూస్తే, గ్రామీణ వాతావరణంలో శ్రీరామ్ తన కుటుంబంతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడానికి పటాసులు తీసుకుని వెళుతున్నట్లు అర్థమవుతోంది. అయితే, చిత్ర టైటిల్, ఇతర పూర్తి వివరాలను చిత్ర బృందం త్వరలో వెల్లడించాల్సి ఉంది.