గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కోసం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుత గుజరాత్ మంత్రివర్గం మొత్తం రద్దు అయినట్లైంది. కాసేపట్లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గవర్నర్‌ను కలిసి అధికారికంగా రాజీనామాలు సమర్పించనున్నారు. ఈ ఆకస్మిక నిర్ణయం రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీలో అంతర్గత అసంతృప్తిని పరిష్కరించేందుకు, కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించేందుకు బీజేపీ హైకమాండ్ తీసుకున్న వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, రేపు శుక్రవారం ఉదయం 11.30 గంటలకు కొత్త కేబినెట్ కొలువుదీరనుంది. కొత్త మంత్రివర్గంలో మందికి పైగా కొత్తవారికి చోటు దక్కే అవకాశం ఉందని, ప్రస్తుత మంత్రులలో దాదాపు సగం మందిని మార్చవచ్చని ప్రచారం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఇతర బీజేపీ సీనియర్ నాయకులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. బీజేపీ ‘నో-రిపీట్’ ఫార్ములాను అమలు చేసి, కొత్త ముఖాలకు, యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కొత్త కేబినెట్ కూర్పులో సామాజిక, ప్రాంతీయ సమతుల్యతను పాటించే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం, కొత్త మంత్రివర్గంలో ఆరుగురు పాటిదార్ నాయకులు (4 లెవ్వా పటేల్, 2 కద్వా పటేల్), ఠాకోర్, కోలి వర్గాల నుంచి నలుగురు, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఇద్దరేసి మంత్రులు ఉండవచ్చని చెబుతున్నారు. దాదాపు నలుగురు మహిళా ఎమ్మెల్యేలకు కూడా కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం.