23 రోజుల పసికందుకూ సోకిన వైరస్‌

రాష్ట్రంలో మంగళవారం మరో 40 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 404కి చేరింది. ఇందులో 23 రోజుల పసికందు కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం 348 మంది కరోనాతో చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 45 మంది వ్యాధి నయమై ఆస్పత్రి డిశ్చార్జి అయ్యారు. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివ్‌ వచ్చివారిలో ఎక్కువ మంది ఢిల్లీ మర్కజ్‌తో సంబంధం ఉన్నవారే.

తాజాగా నమోదైన 40 కేసులు కూడా మర్కజ్‌తో సంబంధం కలిగినవేనని ఆరోగ్యశాఖ తన బులెటిన్‌లో తెలిపింది. వైరస్‌ జన సమూహంలోకి ఇంకా వెళ్లలేదని పేర్కొంది. మర్కజ్‌ నుంచి వచ్చినవారు, వారితో కలిసిమెలిసి తిరిగినవారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నామని, పాజిటివ్‌ వచ్చినవారికి చికిత్స చేస్తున్నామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు ఆ బులిటెన్‌లో వివరించారు. పాజిటివ్‌ కేసులు నమోదైన జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ ప్రణాళికను అమలుచేస్తున్నట్టు చెప్పారు. ఆరు ల్యాబ్‌లు 24 గంటలూ కరోనా పరీక్షలు చేస్తున్నాయని తెలిపారు. కాగా, మర్కజ్‌ లింకు ఉన్నవారికి సంబంధించి మరో 900 మంది ఫలితాలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మరో 15 రోజుల్లో కేసులు పూర్తిగా తగ్గిపోతాయని వైద్యాధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *