గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి బదిలీపై వెళ్లిన ఇద్దరు న్యాయమూర్తులు – జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ డి.రమేశ్ – తిరిగి ఏపీ హైకోర్టుకే రానున్నారు. వీరితో పాటు మరో న్యాయమూర్తి జస్టిస్ సుభేందు సమంత కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన ఈ సిఫార్సుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. అనంతరం ఆ న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రస్తుతం జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గుజరాత్ హైకోర్టులో, జస్టిస్ రమేశ్ అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తులుగా సేవలందిస్తున్నారు. కాగా, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందినవారు కాగా, జస్టిస్ డి.రమేశ్ చిత్తూరు జిల్లాకు చెందినవారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల నియామకానికి అవకాశం ఉండగా, ప్రస్తుతం 30 మంది ఉన్నారు. ఈ ముగ్గురు జడ్జీల రాకతో ఆ సంఖ్య 33కు చేరుకోనుంది.
జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ 2019 జూన్ 20న, జస్టిస్ రమేశ్ 2020 జనవరి 13న.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జీలుగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2023లో బదిలీపై ఇతర హైకోర్టులకు వెళ్లారు. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఏపీ హైకోర్టు ఏర్పాటైన తర్వాత నియమితులైన మొదటి న్యాయమూర్తి కావడం గమనార్హం. జస్టిస్ సుభేందు సమంత పశ్చిమ బెంగాల్‌లో జిల్లా స్థాయి కోర్టుల నుంచి వివిధ కోర్టుల్లో పనిచేసి, కలకత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.