జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేవలం రెండు పార్టీల మధ్య పోటీ కాదని, ఇది రెండు విధాల పాలనల మధ్య జరుగుతున్న సమరమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ అభివృద్ధి పాలనకు, గత రెండేళ్లుగా కాంగ్రెస్ పాలనలో పెరిగిన గందరగోళానికి మధ్య ప్రజలు తుది తీర్పు చెప్పబోతున్నారని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత గోపీనాథ్ గెలవాలని కోట్లాది మహిళలు ఆశిస్తున్నారని, ముఖ్యంగా నెలకు ₹2,500 ఆర్థిక సహాయం హామీ నెరవేర్చాలంటే ప్రజలు సునీత గారిని గెలిపించాలని కోరుతున్నారని కేటీఆర్ తెలిపారు.
గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన ప్రజలకు నిరాశ కలిగించిందని కేటీఆర్ ఆరోపించారు. “రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, మాట తప్పారు. బీసీ రిజర్వేషన్లు, మైనార్టీలకు హామీలు అన్నీ మోసంగా మారాయి. బస్తీ దవాఖానాలు మూతపడ్డాయి, ఉచిత తాగునీటి పథకం నిలిచిపోయింది. హైదరాబాదులో ఒక్క ఇల్లు కూడా కాంగ్రెస్ కట్టలేదు,” అని విమర్శించారు. కేసీఆర్ పాలనలో నిర్మించిన లక్ష ఇళ్లు, పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు, రైతు బంధు, రైతు భీమా వంటి సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దివంగత నాయకుడు మాగంటి గోపీనాథ్ భార్య సునీత గోపీనాథ్ బీఆర్‌ఎస్ తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సునీత గారిని ఎంపిక చేయడం వెనుక కేసీఆర్ గారి నిర్ణయం స్పష్టమని కేటీఆర్ తెలిపారు. గోపీనాథ్ గారు పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా, ఆయన కుటుంబానికి అండగా నిలవాలని తమ పార్టీ నిర్ణయించిందని, సునీత గారి గెలుపు తెలంగాణ గౌరవానికి ప్రతీక అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విజయం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పునరుజ్జీవనానికి నాంది అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.