నకిలీ మద్యం కేసులో కీలక మలుపు… సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు నలుగురు సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో వెలుగుచూసిన కల్తీ మద్యం ఘటనపై ఈ బృందం లోతుగా విచారణ చేపట్టనుంది.

 

ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్‌ను చీఫ్‌గా నియమించారు. సిట్ సభ్యులుగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, సీఐడీ ఎస్పీ కె. చక్రవర్తి, టెక్నికల్ సర్వీసెస్ ఎస్పీ మల్లికా గార్గ్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

 

ఇప్పటికే ములకలచెరువు, భవానీపురం ఎక్సైజ్ పోలీసులు ఈ కేసుపై ప్రాథమిక దర్యాప్తు నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. తదుపరి విచారణను సిట్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నకిలీ మద్యం అక్రమ తయారీ, సరఫరా, పంపిణీ నెట్‌వర్క్‌పై సమగ్రంగా దర్యాప్తు చేసి మూలాలను వెలికితీయాలని స్పష్టం చేసింది. దర్యాప్తు పురోగతిని ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *