కరోనా వైరస్ లాక్‌డౌన్‌లో విషాదం చోటుచేసుకుంది. పొట్టచేత పట్టుకుని బెంగళూరుకు వెళ్తే అక్కడి పని లేక మళ్లీ సొంతూరికి కాలినడకన బయల్దేరిన మహిళ మధ్యలోనే ఆకలి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయింది. రాయచూరు జిల్లా సింధనూరు పట్టణంలోని వెంకటేశ్వర్ నగర్‌కు చెందిన గంగమ్మ (29) అనే మహిళ బతుకు బండి అర్ధాంతరంగా ముగిసిపోయింది.
ఏం జరిగింది
వివరాలు.. బెంగళూరులో భవన నిర్మాణ పనుల్లో కూలీ పనిచేస్తుండగా లాక్‌డౌన్ వల్ల పనులు నిలిచిపోయాయి. కూలీలందరినీ స్వగ్రామాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. దీంతో గంగమ్మతో పాటు పలువురు ట్రాక్టర్‌లో బెంగళూరు నుంచి తుమకూరు వరకు వచ్చారు. అక్కడ వాహనాలను నిలిపేయడంతో కాలినడకన మార్చి 30వ తేదీన పయనమయ్యారు. బళ్లారికి చేరుకునేందుకు మూడు రోజులు పట్టగా, అన్నపానీయాలు లేక తీవ్ర అస్వస్థతకు గురైంది. కరోనా వైరస్ భయంతో దారి మధ్యలో ఎవరూ ఆమెకు తిండి నీళ్లూ ఇవ్వకపోవడం, పలు అనారోగ్య సమస్యలు కూడా వెంటాడాయి. దీంతో బళ్లారికి చేరిన తర్వాత స్థానిక ఎస్సీ, ఎస్టీæ వసతి నిలయంలో చేర్పించారు. అప్పటికే తీవ్రంగా నీరసించిపోయిన గంగమ్మ స్పృహ తప్పి పడిపోయింది. అధికారులు విమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది. నీరసించిపోవడం, రక్తహీనత, కాలేయ సమస్యలు కారణమని వైద్యులు పేర్కొన్నారు.