వైఎస్ జగన్‌కు పోలీసులు షాక్.. విశాఖ రోడ్ షోకి నో పర్మిషన్..

జగన్ విశాఖ పర్యటనపై సందిగ్ధత కొనసాగుతోంది. పర్యటనకు అనుమతులు లేవని కమిషనర్ శంఖ బ్రత బాగ్చి ప్రకటించారు. జగన్ వచ్చే రోజునే విశాఖలో ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ ఉందని, ఆ రోజు పెద్ద సంఖ్యలో జనం మ్యాచ్‌కు వస్తున్నారని తెలిపారు. పోలీస్ మొత్తం ఆ బందోబస్తు సేవలు అందిస్తారని.. ఆ రోజు చిన్న పొరపాటు జరిగినా నగరానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. అందుకే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని.. జగన్ పర్యటనకు అనుమతి లేదన్నారు.

 

హెలికాప్టర్‌లో వెళ్లాలని జగన్‌కు సూచన

విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎయిర్ పోర్ట్ కూడలి నుంచి మర్రిపాలెం కూడలి వరకు 11 కిలోమీటర్లు వైఎస్ జగన్ పర్యటన మార్గం ఉందన్నారు. ర్యాలీగా వేల మంది వస్తారని.. జాతీయ రహదారి బ్లాక్ అవుతుందన్నారు. తమిళనాడులో సినీ నటుడు విజయ్ రోడ్ షో కి ఏ విధమైన ఇబ్బంది వచ్చిందో అదే పరిస్థితి వస్తుందన్నారు. ఈ కారణాలతో జగన్ పర్యటనకు పోలీస్ అనుమతి లేదని కమిషనర్ తేల్చి చెప్పారు. రోడ్డు మార్గాన అనుమతి లేదని, కావాలంటే హెలికాప్టర్‌లో అనకాపల్లి ప్రాంతాల్లో పర్యటించొచ్చని చెప్పారు.

 

ఎట్టి పరిస్థితుల్లోనూ పర్యటన చేసి తీరతామన్న అమర్నాథ్..

దీనిపై వైసీపీ నాయకులు తీవ్ర రాద్ధాంతం చేస్తున్నారు. పోలీసులు అనుమతి ఇచ్చినా.. ఇవ్వక పోయినా పర్యటన ఉంటుందని తేల్చిచెప్తున్నారు. జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఎట్టిపరిస్థితుల్లో రేపు ఆయన పర్యటన ఉంటుందన్నారు. ఏజెన్సీలో వాతావరణ పరిస్థితులు బాగోవని తెలిసినా, పోలీసులు హెలికాప్టర్‌లో రమ్మనడం వెనుక కుట్ర కోణం ఏంటని ప్రశ్నించారు.

 

జగన్‌కు కార్యకర్తలే భద్రత కల్పిస్తారని వ్యాఖ్య

 

సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు జగన్ వద్దకు వస్తారని, పోలీసులు భద్రత కల్పించకుంటే పార్టీ శ్రేణులే సెక్యూరిటీగా ఉంటారని అన్నారు. పోలీసులు ప్రేమలేఖలు రాయడం మానేసి జగన్‌కు భద్రత కల్పిస్తే సహకరిస్తామన్నారు. మెడికల్ కాలేజ్ గురించి వక్ర వ్యాఖ్యలు చేస్తున్న తాగుబోతులు, తిరుగుబోతు పెద్దలకు జగన్ గట్టిగా సమాధానం చెబుతారని తెలిపారు.

 

స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆహ్వానం మేరకు జగన్ నర్సీపట్నం వెళ్తున్నారు అని.. పోలీసులు ఇప్పుడు అనుమతి లేదు అంటే స్పీకర్‌ను అగౌరవ పరిచినట్లే అన్నారు పేర్ని నాని. స్పీకర్‌కి మెడికల్ కాలేజీ కనిపించడం లేదని, జగన్ వెళ్లి చూపిస్తారని విమర్శించారు. మెడికల్ కాలేజీకి సంబంధించిన జీవోను, నిర్మాణాలను, పనులు ఆపివేయాలని ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా చూపిస్తామని తెలిపారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తప్పు అని కోటి సంతకాలతో ప్రజల అభిప్రాయాలు తీసుకుని గవర్నర్‌ను కలుస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం శ్రీరంగ నీతులు చెప్పి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *