మహిళా భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్లకు ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలను కల్పించనుంది

అమరావతి: రాష్ట్రంలో మహిళా భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్లకు ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలను కల్పించనుంది. మహిళలపై జరిగే దాడులు, లైంగిక వేధింపులను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టంలో భాగంగా ఈ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా మరో ఆరు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రెండు చొప్పున ఈ పోలీస్ స్టేషన్లను నెలకొల్పాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.

ఒక్కో పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణ అంచనా వ్యయం సుమారు మూడు కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. మరోో మూడు నెలల్లో దీని నిర్మాణ పనులు ఆరంభమయ్యే అవకాశాలు లేకపోలేదు. దీనికి అనుగుణంగా పెట్రోలింగ్‌ వ్యవస్థను పటిష్టం చేయడానికి 145 వాహనాలను కొనుగోలు చేయనుంది. దీనికోసం సుమారు 16 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే- దిశ పోలీస్ స్టేషన్ల పెట్రోలింగ్ కోసం ప్రభుత్వం స్కూటర్లను కొనుగోలు చేసింది.

కొత్తగా కొనుగోలు చేయదలిచిన వాహనాలు దీనికి అదనం. ఈ వాహనాలను ప్రభుత్వం దిశ యాప్‌తో అనుసంధానిస్తుంది. దీనివల్ల యాప్ ద్వారా అందిన ఎస్ఓఎస్ మెసేజ్‌లు తక్షణమే పెట్రోలింగ్ వాహనాలకు అందేలా ఈ ఏర్పాటు ఉంటుంది. రాష్ట్రంలో అయిదు పోలీస్‌ కమిషనర్ కార్యాలయాలకు ఈ కొత్త వాహనాలను కేటాయిస్తుంది. కమిషనరేట్లతో పాటు అన్ని జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయాలకు వాటిని కేటాయిస్తుంది. ఒక్కో జిల్లా ఎస్పీ కార్యాలయానికి అయిదు చొప్పున కొత్త వాహనాలను అందజేస్తుంది.

సమస్యాత్మక ప్రాంతాల్లో వాటిని మోహరింపజేస్తుంది. మహిళలు, విద్యార్థినులకు భద్రత కల్పించడానికి ఉద్దేశించినవి కావడం వల్ల వాటిని రద్దీ ప్రాంతాలు, కళాశాలల వద్ద అందుబాటులో ఉంచుతారు. యాప్ ద్వారా ఎస్ఓఎస్ మెసేజ్ అందిన వెంటనే స్పందించేలా అత్యాధునిక సమాచార వ్యవస్థను ఈ వాహనాల్లో అమర్చుతారు. ఈ వాహనాలకు అనుసంధానంగా స్కూటర్లు ఉంటాయి. ఎస్ఓఎస్ మెసేజ్ అందిన వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లేలా పెట్రోలింగ్‌ను బలోపేతం చేయనుంది ప్రభుత్వం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *