మానవ సహిత వ్యోమనౌక విఎస్‌ఎస్‌ యూనిటిా22 యాత్ర విజయవంతమైంది

ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్‌ గెలాక్టిక్‌ ఆదివారం నిర్వహించిన మానవ సహిత వ్యోమనౌక విఎస్‌ఎస్‌ యూనిటిా22 యాత్ర విజయవంతమైంది. సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌తో సహా ఆరుగురు సభ్యులతో కూడిన బఅందం అంతరిక్షంలో చక్కర్లు కొట్టి దాదాపు 90 నిమిషాల తర్వాత తిరిగి భూమిని చేరుకుంది. అమెరికాలోని న్యూమెక్సికో నుంచి చేపట్టిన ఈ యాత్ర ద్వారా రోదసిలోకి మన తెలుగు మహిళ తొలిసారి ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష ఈ ఘనత సాధించారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ ఆదివారం వ్యోమనౌక విఎస్‌ఎస్‌ యూనిటి-22ను విఎంఎస్‌ ఈవ్‌ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడి నుంచి రాకెట్‌ ప్రజ్వలనంతో యూనిటి-22 మరింత ఎత్తుకు వెళ్లింది. చివరి దశలో సొంత ప్రయాణాన్ని ప్రారంభించింది.
ఈ వ్యోమనౌకలో బ్రాన్సన్‌తో పాటు ప్రయాణించిన వారిలో 34 ఏళ్ల శిరీష కూడా ఉన్నారు. నాలుగో వ్యోమగామిగా ఉన్న శిరీష వ్యోమనౌకలో మానవ తీరుతెన్నులకు సంబంధించి ఫ్లోరిడా విశ్వవిద్యాలయం రూపొందించిన ప్రయోగాన్ని నిర్వహించారు. తాజా యాత్ర విజయవంతం కావడంతో భారత్‌ నుంచి అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష రికార్డులకు ఎక్కారు. గతంలో రాకేశ్‌ శర్మ, కల్పనా చావ్లా, భారత-అమెరికన్‌ సునీతా విలియమ్స్‌ రోదసిలోకి వెళ్లి వచ్చారు. గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష తల్లిదండ్రులతోపాటు అమెరికాలోని హోస్టన్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె వర్జిన్‌ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ అంతరిక్ష యాత్రలో భాగస్వామి కావడం తనకెంతో గౌరవ కారణమని శిరీష ట్వీట్‌ చేశారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్ష యాత్రకు సంబంధించిన లైవ్‌ను యూట్యూబ్‌లో షేర్‌ చేశారు.
శిరీషకు గవర్నర్‌, సిఎం అభినందనలు
అంతరిక్షంలోకి ప్రవేశిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీషకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. అంతరిక్షంలోకి వెళుతున్న నాలుగో మహిళగా, రెండో భారతి సంతతి మహిళగా శిరీష గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. ఇది తెలుగు రాష్ట్రాలకే గర్వకారణమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *