కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో మీటర్ రీడింగ్ తీసుకోకుండా ప్రత్యామ్నాయ విధానంలో ఎల్టీ విద్యుత్ వినియోగదారులకు ప్రస్తుత ఏప్రిల్ నెలలో బిల్లులు జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తాజాగా అనుమతిచ్చింది. గతేడాది సరిగ్గా ఏప్రిల్ నెలలో లేదా గత మార్చి నెలలో జారీ చేసిన విద్యుత్ బిల్లులు ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుత ఏప్రిల్ నెలలో వినియోగదారులకు తాత్కాలిక బిల్లులు జారీ చేస్తామని దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది. రాష్ట ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తివేసిన వెంటనే తదుపరి నెలకు సంబంధించిన మీటర్ రీడింగ్‌ను తీసి వినియోగదారుల వాస్తవ విద్యుత్ వినియోగం ఆధారంగా తాత్కాలిక విధానంలో జారీ చేసిన బిల్లుల్లోని హెచ్చుతగ్గులను సరిదిద్దాలని ఆదేశించింది. ఏప్రిల్‌లో ఎల్టీ వినియోగదారులకు ఈ కింది పద్ధతిలో విద్యుత్ బిల్లులు జారీ చేయనున్నారు.
విద్యుత్ బిల్లు జారీ ఇలా..
► 2019 మార్చి నాటికి ఉనికిలో ఉన్న గృహ (ఎల్టీ–1), వీధి దీపాలు (ఎల్టీ–6ఏ), నీటి సరఫరా పథకాల (ఎల్టీ–6బీ) విద్యుత్ కనెక్షన్ల వినియోగదారులకు 2019 ఏప్రిల్‌లో జారీ చేసిన బిల్లులకు సమాన బిల్లులను ప్రస్తుత ఏప్రిల్ నెలలో జారీ చేయనున్నారు. అంటే మార్చి 2019లో వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను 2019 ఏప్రిల్‌లో చెల్లించాలి. 2020 మార్చిలో వాడిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను సైతం తాత్కాలికంగా 2019 మార్చిలో వాడిన విద్యుత్ గణాంకాల ప్రాతిపదిక వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించగా, ఈఆర్సీ ఆమోదించింది.
► 2019 ఏప్రిల్ 1– 2020 ఫిబ్రవరి 29 మధ్య కాలంలో జారీ చేసిన గృహ (ఎల్టీ–1), వీధి దీపాలు (ఎల్టీ–6ఏ), నీటి సరఫరా పథకాల (ఎల్టీ–6బీ) విద్యుత్ కనెక్షన్ల వినియోగదారులకు 2020 మార్చిలో జారీ చేసిన బిల్లుకు సమాన బిల్లును ప్రస్తుత నెలలో జారీ చేయనున్నారు.
► మార్చి 2020లో జారీ చేసిన కొత్త గృహ (ఎల్టీ–1), వీధి దీపాలు (ఎల్టీ–6ఏ), నీటి సరఫరా పథకాల (ఎల్టీ–6బీ) విద్యుత్ కనెక్షన్ల వినియోగదారులకు కనీస డిమాండ్ ప్రాతిపదికన ఏప్రిల్ 2020లో బిల్లులు జారీ చేయనున్నారు.