పెట్రో ధరల పెంపునకు అంతు లేకుండా పోతోంది

పెట్రో ధరల పెంపునకు అంతు లేకుండా పోతోంది. శనివారం పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెరిగింది. దీంతో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ దాటినట్లైంది. జులై నెలలో ఇది ఏడోసారి పెంపు కాగా, మే 4 నుంచి కేంద్ర ప్రభుత్వం 39 సార్లు పెట్రో ధరలను పెంచింది. తాజా ధరల సవరణతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 100.91 ఉండగా, డీజిల్‌ రూ.89.88కి చేరింది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో ఈ ధరలు వరుసగా రూ.106.93, రూ.97.46, కోల్‌కతాలో రూ.101.01, 92.97గా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో అత్యధికంగా లీటర్‌ పెట్రోల్‌ రూ.109.24కు అమ్ముతుండగా, డీజిల్‌ రూ.98.76కు పెరిగింది. పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటిన నగరాల జాబితాలో మొదటి స్థానంలో భోపాల్‌ ఉండగా, ఆ తరువాతి స్థానాల్లో జైపూర్‌, ముంబై, హైదరాబాద్‌, బెంగళూరులు ఉన్నాయి. ఇప్పటి వరకు పెట్రోల్‌ రూ.100 దాటిన రాష్ట్రాలు, యుటిల జాబితాలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, జమ్ముకాశ్మీర్‌, ఒడిషా, లడఖ్‌, బీహార్‌, కేరళ, తమిళనాడు, పంజాబ్‌, సిక్కిం, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, నాగాలాండ్‌ ఉన్నాయి. మన రాష్ట్రంలో విజయవాడలో శనివారంపెంపుతో రూ.107.07కు లీటరు పెట్రోలు ధర పెరిగింది.
ప్రజలపై కేంద్రం క్రిమినల్‌ దాడులు : ఏచూరి

ప్రజల జీవనోపాధిపై మోడీ ప్రభుత్వం పాల్పడుతున్న క్రిమినల్‌ దాడులు అపరిమితంగా, భరించలేనివిగా ఉన్నాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు. గత ఆరు రోజుల్లో పెట్రో ధరలు నాలుగుసార్లు పెరిగాయని అన్నారు. ఈ ధరల పెంపును ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు దేశవ్యాప్త ఆందోళనల్లో పాలుపంచుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ”పెట్రో ధరల పెంపుదల ప్రభావంతో ద్రవ్యోల్బణ చట్రం ప్రజల జీవితాలను నాశనం చేస్తోంది మోడీ గారూ.. వెంటనే ఆదాయ పన్ను పరిధిలోని కుటుంబాలకు నెలకు రూ.7,500 ప్రత్యక్ష నగదు బదిలీ చేపట్టడంతో పాటు రోజువారీ అవసరాల కోసం ఉచిత ఆహార కిట్లు సరఫరా చేయండి’ అని మరో ట్వీట్‌లో ఏచూరి డిమాండ్‌ చేశారు.
పెట్రో ధరల పెంపుపై దేశవ్యాప్త ఆందోళనలు : కాంగ్రెస్‌

పెట్రో ధరల పెంపు వల్ల ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయని, ఇళ్ల బడ్జెట్లు తారుమారయ్యాయని కాంగ్రెస్‌ పేర్కొంది. మోడీ సర్కారు తీరును నిరసిస్తూ వచ్చే వారం దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఢిల్లీలో మీడియాకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *