హ్యాకర్ల వలలో స్టార్ హీరో ఉపేంద్ర.. డెలివరీ పేరుతో ఫోన్లు హ్యాక్..!

ప్రముఖ కన్నడ నటుడు, రియల్ స్టార్ ఉపేంద్ర, ఆయన భార్య ప్రియాంక సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. డెలివరీ పేరుతో ఫోన్ చేసిన కేటుగాళ్లు, వారిద్దరి మొబైల్ ఫోన్లను హ్యాక్ చేశారు. ఈ షాకింగ్ విషయాన్ని స్వయంగా ఉపేంద్రే సోషల్ మీడియా ద్వారా వెల్లడించి, తమ అభిమానులను, ప్రజలను అప్రమత్తం చేశారు.

 

వివరాల్లోకి వెళితే, ఉపేంద్ర భార్య ప్రియాంకకు ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఆర్డర్ చేసిన వస్తువు డెలివరీ కోసం కాల్ చేస్తున్నట్లు నమ్మబలికాడు. డెలివరీ ప్రక్రియ పూర్తి కావాలంటే కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లు, నంబర్లను ఫోన్‌లో ఎంటర్ చేయాలని సూచించాడు. అది నిజమని నమ్మిన ఆమె, అవతలి వ్యక్తి చెప్పినట్లే చేయడంతో ఫోన్ హ్యాకింగ్‌కు గురైందని ఉపేంద్ర తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తన ఫోన్ కూడా హ్యాక్ అయిందని ఆయన వివరించారు.

 

ఈ ఘటనపై ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. “నా భార్య ఫోన్, ఆ తర్వాత నా ఫోన్ హ్యాక్ అయ్యాయి. మా ఫోన్ నంబర్ల నుంచి గానీ, సోషల్ మీడియా ఖాతాల నుంచి గానీ ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే దయచేసి స్పందించవద్దు. అలాంటి మెసేజ్‌లు లేదా కాల్స్ వస్తే ఏమాత్రం డబ్బు పంపొద్దు” అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సెలబ్రిటీలకే ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో, సామాన్య ప్రజలు ఆన్‌లైన్ మోసాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *