ప్రాంతీయ పార్టీల ఆస్తులు.. బీఆర్‌ఎస్‌ నంబర్ 1, టీడీపీ నాలుగో స్థానం..

దేశంలోని ప్రాంతీయ పార్టీల ఆదాయంలో తెలుగు రాష్ట్రాల పార్టీలు సత్తా చాటాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్‌) విడుదల చేసిన నివేదిక ప్రకారం, తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ దేశంలోనే అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలోని తొలి ఐదు స్థానాల్లో మూడు తెలుగు పార్టీలు ఉండటం విశేషం.

 

ఏడీఆర్‌ నివేదిక వివరాల ప్రకారం, 2023-24లో బీఆర్‌ఎస్‌ రూ.685.51 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. ఆ తర్వాతి స్థానంలో పశ్చిమబెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రూ.646.39 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ (బీజేడీ) రూ.297.81 కోట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక, ఏపీకి చెందిన అధికార టీడీపీ రూ.285.07 కోట్లతో నాలుగో స్థానాన్ని, వైసీపీ రూ.191.04 కోట్లతో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాయి.

 

దేశవ్యాప్తంగా దాదాపు 40 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయం రూ.2,532.09 కోట్లుగా ఉందని ఏడీఆర్‌ నివేదిక స్పష్టం చేసింది. అయితే, ఈ మొత్తం ఆదాయంలో సింహభాగం కేవలం ఐదు పార్టీలదే కావ‌డం గమనార్హం. తొలి ఐదు స్థానాల్లో ఉన్న బీఆర్‌ఎస్‌, టీఎంసీ, బీజేడీ, టీడీపీ, వైసీపీల వాటానే ఏకంగా 83.17 శాతంగా నమోదైంది. మిగిలిన పార్టీలన్నీ కలిపి కేవలం 17 శాతం లోపే ఆదాయాన్ని కలిగి ఉన్నాయని ఈ నివేదిక గణాంకాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *