స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్..! కేటీఆర్ జిల్లాల పర్యటన..!

కేసీఆర్ చేపట్టిన గణపతి హోమం పూర్తి అయ్యిందా? రంగంలోకి దిగాలని భావిస్తున్నారా? స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్‌గా ఆ పార్టీ పెట్టుకుందా? బుధవారం నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారా? తొలుత ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఫోకస్ చేశారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ విషయమై వారం రోజులుగా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో అధినేత కేసీఆర్‌.. కేటీఆర్‌తోపాటు పలువురు నేతలతో పలుమార్లు మంతనాలు జరిపారు. పార్టీలో అంతర్గత విభేదాలను పక్కన పెట్టేయాలని హైకమాండ్ డిసైడ్ అయ్యింది.

 

పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు కీలక సూచనలు చేశారట కేసీఆర్. కవిత వ్యవహారం తాను చూసుకుంటానని, రేపో మాపో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో అటువైపు దృష్టి పెట్టాలని అన్నారట. ఈ క్రమంలో బుధవారం నుంచి జిల్లాల పర్యటనలకు కేటీఆర్ ప్లాన్ చేసినట్టు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.

 

ఏ మాత్రం ఆలస్యం చేసినా కేడర్ చేజారిపోయే అవకాశం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛాన్స్ ప్రత్యర్థులకు ఇవ్వకూడదని అధినేత నిర్ణయించుకున్నారట. బీజేపీకి గ్రామీణ , అర్బన్ ప్రాంతాల్లో పెద్దగా కేడర్ లేదన్నారు. పోటీ మాత్రం బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీ మధ్య ఉంటుందని చెప్పారట.

 

అధికార పార్టీ వైఫల్యాలను ఎట్టి చూపుతూ ప్రజల్లోకి వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని, ఇలాంటి సమయంలో కేడర్‌కు దూరంగా ఉండవద్దని సలహా ఇచ్చారట. ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఫోకస్ చేస్తూ అటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కారు జెండా రెపరెపలాడాలని వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం.

 

పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను టార్గెట్ చేయాలన్నది కేటీఆర్ ఆలోచన. ఈ నేపథ్యంలో ఈ‌నెల 10న కొత్తగూడెం, 11న భద్రాచలం నియోజకవర్గాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టూర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 13న‌ గద్వాల్‌లో బహిరంగ సభ ప్లాన్ చేశారు. దసరా నవరాత్రులు మొదలైనలోపు వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారట కేటీఆర్.

 

ఇదేక్రమంలో జూబ్లీహిల్స్ బైపోల్‌పై దృష్టి సారించింది. ఎలాగైనా ఈ సీటును కైవసం చేసుకోవాలని భావిస్తోంది బీఆర్ఎస్. పార్టీ తరపున ఎవరిని నిలబెడితే బాగుంటుందని సిటీ ఎమ్మెల్యేలతో చర్చించారట. బీసీ అభ్యర్థిని బరిలోకి దించితే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారట.

 

కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటివరకు రేసులో ఉన్న అజారుద్దీన్ మండలికి పంపాలని కాంగ్రెస్ ప్లాన్ చేయడం, కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవడం జరిగి పోయింది. ఈ విషయంలో బీజేపీ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. కమలం అభ్యర్థి ఎవరన్నది పరిశీలించిన తర్వాత అప్పుడు పార్టీ అభ్యర్థిని డిసైడ్ చేద్దామని కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *