తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వద్ద ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండగా.. ఇప్పటికే తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ఉపరితల ద్రోణి 2.1 కిమీ ఎత్తులో ఏర్పడి ఉండడంతో అల్పపీడనం మరింత బలపడి భారీ ఉరుములు, మెరుపులతో తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మరోవైపు రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా ఆదివారం నుండి మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.
ఆదిలాబాద్, కుమ్రంభీం, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, వరంగల్ అర్బన్, రూరల్, జనగాం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.