విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్ కార్మికులు చేపట్టిన 30 కిలోమీటర్ల భారీ నిరసన ర్యాలీ కొనసాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కార్మికులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేస్తున్నారు. స్టీల్ పరిరక్షణా పోరాట కమిటీ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం గేట్ నుంచి ర్యాలీగా బయలుదేరాయి. వేలాదిమంది కార్మికులు నిరసన ర్యాలీలో భాగంగా కూర్మన్నపాలెం, వడ్లపూడి, గాజువాక మీదుగా ముందుకు సాగుతున్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలపై కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం వద్ద చేపట్టిన దీక్షలు 150వ రోజుకు చేరాయి. కార్మికుల దీక్షలు జీవీఎంసీ వద్ద 100వ రోజుకు చేరాయి. ఈ నేపథ్యంలో స్టీల్ ఉద్యమానికి మద్దతు కోరిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉత్తరాంధ్ర జిల్లాల ఎంపీలను కలిసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అన్ని వర్గాల సహకారంతో ఉద్యమిస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్య రామ్ పేర్కొన్నారు.