రామసేతుకు జాతీయ హోదా..!

రామసేతువును జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించాలన్న డిమాండ్‌పై సుప్రీంకోర్టు కీలక ముందడుగు వేసింది. ఈ అంశంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నిర్దిష్ట సమయంలోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ స్వామి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

 

జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) డైరెక్టర్, ఏఎస్ఐ తమిళనాడు ప్రాంతీయ డైరెక్టర్‌ ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. స్వామి తరఫున సీనియర్ న్యాయవాది విభా దత్తా మఖిజా, న్యాయవాది సత్య సబర్వాల్ వాదనలు వినిపించారు.

 

రామసేతువును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించే విషయంలో తన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సుబ్రహ్మణ్యస్వామి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రామసేతువుకు సంబంధించిన మతపరమైన, చారిత్రక ప్రాముఖ్యతను గుర్తించి, దాని పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. ఈ విషయంపై గత ఏడాది జనవరిలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వానికి మరిన్ని పత్రాలు సమర్పించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో, మే 13న మళ్లీ కేంద్ర సాంస్కృతిక మంత్రికి విజ్ఞప్తి చేసి, తాజాగా సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *