విజయనగరం ఐసిస్ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసింది. అరెస్టయిన నిందితుడు బీహార్‌కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ అని ఎన్ఐఏ పేర్కొంది. దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్ఐఏ బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. నిందితుడిని విశాఖపట్నంలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.
విజయనగరం ఐసిస్ ఉగ్ర కేసులో ఇదివరకే అరెస్టయిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్‌లతో ఆరిఫ్‌కు సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. సిరాజ్, సమీర్‌ల వద్ద ఐఈడీఎస్ (విస్ఫోటక పరికరాలు) తయారీకి అవసరమైన రసాయనాలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. వీరు ఉగ్రదాడులకు వ్యూహం పన్నినట్లు ఎన్ఐఏకి ఆధారాలు లభించాయి.
దేశవ్యాప్తంగా జిహాదీ కార్యకలాపాల కోసం ఆరిఫ్ అక్రమ ఆయుధాలను సరఫరా చేసినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.