సికింద్రాబాద్-వాడి రైల్వే లైన్‌కు రూ. 5,012 కోట్లు..!

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య రైల్వే కనెక్టివిటీని గణనీయంగా పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ (సనత్‌నగర్) నుంచి వాడి వరకు మూడవ, నాలుగవ రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 5,012 కోట్లను కేటాయించింది.

 

ఈ ప్రాజెక్టులో భాగంగా 173 కిలోమీటర్ల పొడవున కొత్త లైన్లను నిర్మించనున్నారు. ఐదేళ్లలో ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మార్గం విస్తరణ వల్ల తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని దాదాపు 47.34 లక్షల జనాభాకు మేలు చేకూరనుంది. ముఖ్యంగా, వెనుకబడిన ప్రాంతంగా గుర్తించిన కర్ణాటకలోని కలబురగి జిల్లా అభివృద్ధికి ఇది దోహదపడనుంది. ఈ ప్రాజెక్టుతో రైళ్ల రాకపోకల్లో జాప్యం తగ్గి, ప్రయాణికులు, సరుకు రవాణా మరింత వేగవంతం కానుంది.

 

ఈ ప్రాజెక్టుతో పాటు దేశవ్యాప్తంగా మరో మూడు కీలక రైల్వే ప్రాజెక్టులకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. గుజరాత్, బీహార్, అస్సాం రాష్ట్రాల్లో చేపట్టనున్న ఈ పనులతో కలిపి మొత్తం నాలుగు ప్రాజెక్టుల వ్యయం రూ. 12,328 కోట్లుగా ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌కు కొత్తగా 565 కిలోమీటర్ల లైన్లు జతకానున్నాయి.

 

ఈ పనుల వల్ల బొగ్గు, సిమెంట్, స్టీల్, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు వంటి కీలక సరుకుల రవాణా సులభతరం అవుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో సుమారు 251 లక్షల పనిదినాల ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా వేసింది. పీఎం-గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టులు సమగ్ర అభివృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడతాయని కేంద్రం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *