ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి)లో అత్యున్నత పదవి అయిన ఛైర్మన్ హోదాను రద్దు చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ స్థానంలో ఇక చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సిఇఒ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) పదవులను ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు లోపు ఎల్‌ఐసిలోని వాటాలను ఐపిఒ ద్వారా విక్రయించనున్న నేపథ్యంలో ఛైర్మన్ హోదాను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎల్‌ఐసి చట్టం 1956లోనూ ఆర్థిక శాఖ కొన్ని మార్పులు చేసింది. ఎల్‌ఐసి లిస్టింగ్‌కు వీలు కల్పించేందుకు ఆర్థిక శాఖ సెక్యురిటీస్ కాంట్రాక్స్‌కు సంబంధించిన నిబంధనలను సవరించిన విషయం తెలిసిందే. ఐపిఒ ద్వారా ఎల్‌ఐసిలోని 5 శాతం వాటాలను కేంద్రం విక్రయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. షేర్ల విక్రయ సమయంలో పాలసీదారులకు 10 శాతం వాటాలు కేటాయించే అవకాశాలున్నాయి.