తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా హర్పాల్ సింగ్..

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సలహాదారుగా లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ (రిటైర్డ్)ను నియమిస్తూ సీఎస్ రామకృష్ణ రావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రెండు సంవత్సరాల కాలానికి ప్రభుత్వం నియమించింది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న నీటిపారుదల సొరంగ ప్రాజెక్టులలో సమస్యలను పరిష్కరించడం కోసం.. అలాగే పనులను వేగవంతం చేయడంతో పాటు ఆయన నైపుణ్యాన్ని, సేవలను నీటి పారుదల, సీఏడీ విభాగంలో వినియోగించుకోనున్నారు.

 

భారత సైన్యంలో జనరల్ హర్పాల్ సింగ్ 40 ఏళ్లకు పైగా పనిచేసిన అనుభవం ఉంది. భారత రక్షణ దళాల వ్యూహాత్మక మౌలిక సదుపాయాలలో ఆయనకు గొప్ప పేరు ఉంది. పెద్ద ఎత్తున సివిల్ మౌలిక సదుపాయ ప్రాజెక్టులను.. అధునాతన సాంకేతికత పరిష్కారాలను అమలు చేయడంలో ఆయనకు ఎక్స్ పీరియన్స్ ఉంది. లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ భారత సైన్యంలో అత్యంత సీనియర్ అధికారి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) ఖడక్‌వాస్లా నుంచి గ్రాడ్యుయేట్ పొందారు. 1982 డిసెంబర్ 24న కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌లో కమిషన్ పొందారు. ఆయన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) డైరెక్టర్ జనరల్‌గా.. భారత సైన్యం ఇంజనీర్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు. జమ్ము కశ్మీర్‌లో బోర్డర్ రోడ్స్ టాస్క్ ఫోర్స్‌ను నడిపించడం, భూటాన్‌లో ప్రాజెక్ట్ దంతక్‌లో చీఫ్ ఇంజనీర్‌గా, ముంబైలో నేవీ చీఫ్ ఇంజనీర్‌గా, తూర్పు కమాండ్‌లో చీఫ్ ఇంజనీర్‌గా వివిధ కీలక పదవులను ఆయన నిర్వహించారు.

 

హర్పాల్ సింగ్ రోడ్లు, సొరంగాల నిర్మాణంలో గొప్ప నిష్ణాతుడు. 2025 ఫిబ్రవరిలో SLBC సొరంగం కూలిన సమయంలో ఆయన నైపుణ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడింది. సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది రక్షణ కార్యక్రమంలో ఆయన సలహాలు కీలకమైనవి. ఆయన సూచనలు శాస్త్రీయమైన, నిరూపితమైన మార్గాన్ని చూపించాయని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

 

ఈ నియామకం ద్వారా.. తెలంగాణ ప్రభుత్వం SLBC సొరంగ ప్రాజెక్టును వేగవంతం చేయడంతో పాటు, నీటిపారుదల రంగంలో సాంకేతిక నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి హర్పాల్ సింగ్ నైపుణ్యాన్ని ఉపయోగించుకోనుంది. ఆయన అనుభవం, నాయకత్వం రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి గణనీయమైన కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *