మరో ప్లాన్ కూడా నిలిపివేసిన రిలయన్స్ జియో..!

దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ ప్లాన్‌లలో మార్పులు చేస్తోంది. ఇప్పటికే రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తొలగించిన జియో.. తాజాగా రూ.799 ప్లాన్‌ను కూడా నిలిపివేసింది. దీంతో ఈ ప్లాన్ కింద డేటా, కాలింగ్, ఎస్‌ఎంఎస్‌ సేవలను పొందుతున్న వినియోగదారులు ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

 

ఇప్పటివరకు రూ.799 ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభించేవి. అయితే, ఇకపై అదే ప్రయోజనాల కోసం వినియోగదారులు రూ.889 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు అదనంగా JioSaavn Pro సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అయితే, ఈ ప్లాన్‌తో 5G సేవలు అందుబాటులో ఉండవు.

 

మరో ప్రత్యామ్నాయంగా రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్‌లో 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు JioCinema లేదా Hotstar Mobile/TV సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్‌కు కూడా 5G సదుపాయం లేదు. గత ఏడాది నుంచి రోజుకు 2GB డేటా అందించే ప్లాన్‌లకే జియో 5G సదుపాయాన్ని అందిస్తోంది.

 

రిలయన్స్ జియో ప్రస్తుతం మార్కెట్ లిస్టింగ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు వినియోగదారుల నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే తక్కువ ధరకే లభించే రూ.249, రూ.799 ప్లాన్‌లను నిలిపివేస్తున్నట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల ఎయిర్‌టెల్ కూడా రూ.249 ప్లాన్‌ను తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెలికాం రంగంలో టారిఫ్‌లను పెంచకుండా, ప్లాన్ ఎంపికలను పరిమితం చేసి ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *