ఈసీ వివరణ వింటుంటే నవ్వొస్తోంది: జైరాం రమేశ్..

బీహార్ ఓటర్ల జాబితా సవరణలో ‘ఓట్ల చోరీ’ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇచ్చిన వివరణను ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈసీఐ వివరణ ఏమాత్రం సంతృప్తికరంగా లేదని, వారి వ్యాఖ్యలు నవ్వు తెప్పించేలా ఉన్నాయని ఎద్దేవా చేసింది. ఎన్నికల సంఘం అసమర్థత, పక్షపాత వైఖరితో పూర్తిగా బట్టబయలైందని ఆరోపిస్తూ దాడిని మరింత ఉధృతం చేసింది.

 

నేడు ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగిందని, తాము రాజ్యాంగబద్ధంగా పనిచేసే స్వతంత్ర సంస్థ అని ఆయన స్పష్టం చేశారు. ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు తెలిపేందుకు ఇంకా 15 రోజుల సమయం ఉందని, రాజకీయ పార్టీలు తమ ఫిర్యాదులను సమర్పించవచ్చని తెలిపారు. తమను ఎవరూ భయపెట్టలేరని ఆయన వ్యాఖ్యానించారు.

 

సీఈసీ ప్రెస్ మీట్ ముగిసిన కొద్ది నిమిషాల్లోనే కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడికి దిగారు. “లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన సూటి ప్రశ్నలకు సీఈసీ అర్థవంతంగా సమాధానం ఇవ్వలేదు. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి” అని విమర్శించారు. అధికారికంగా కాకుండా వర్గాల ద్వారా సమాచారం లీక్ చేసే ఈసీ, ఇప్పుడు నేరుగా మాట్లాడటం ఇదే మొదటిసారని ఆయన చురక అంటించారు.

 

“రాహుల్ గాంధీకి సీఈసీ బెదిరింపుల విషయానికొస్తే, ఈసీ డేటాలోని వాస్తవాలనే రాహుల్ ప్రస్తావించారు. ఎన్నికల సంఘం తన అసమర్థతతోనే కాకుండా, పచ్చి పక్షపాతంతో కూడా పూర్తిగా బట్టబయలైంది” అని జైరాం రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

కొంతకాలంగా రాహుల్ గాంధీ, బీహార్ ఓటర్ల జాబితా విషయంలో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా ఈసీ కుమ్మక్కైందని ఆరోపిస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మంది పేర్లను తొలగించిన వివరాలను బయటపెట్టాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన మూడు రోజుల తర్వాత ఈసీ ఈ ప్రెస్ మీట్ పెట్టడం గమనార్హం. ఈసీ వివరణతో ప్రతిపక్షాలు ఏకీభవించకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *