భారత్-పాక్‌పై నిరంతర నిఘా.. అమెరికా కీలక ప్రకటన..

భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న పరిస్థితులను తాము ప్రతిరోజూ నిశితంగా గమనిస్తున్నామని అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇరు దేశాల మధ్య అణు యుద్ధం జరగకుండా నివారించడంలో తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మరోసారి స్పష్టం చేశారు. ఈ వాదనను భారత్ ఇప్పటికే పలుమార్లు ఖండించినప్పటికీ, అమెరికా అదే పంథాను కొనసాగించడం గమనార్హం.

 

ఆదివారం ‘ఎన్బీసీ న్యూస్’ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబియో మాట్లాడుతూ, కాల్పుల విరమణ ఒప్పందాలు చాలా సున్నితమైనవని, వాటిని కొనసాగించడం ఎంతో కష్టమని అన్నారు. “అందుకే భారత్-పాకిస్థాన్ మధ్య ఏం జరుగుతోందో ప్రతిరోజూ గమనిస్తున్నాం” అని ఆయన తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం విజయవంతం కాకపోవడానికి కారణం కాల్పులు ఆపేందుకు రష్యా అంగీకరించకపోవడమేనని ఆయన ఉదహరించారు.

 

మరోవైపు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా భారత్-పాక్ మధ్య శాంతిని నెలకొల్పింది తానేనని పదేపదే చెబుతున్నారు. వాషింగ్టన్ మధ్యవర్తిత్వంతోనే ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన అనేకసార్లు ప్రకటించారు. ఆశ్చర్యకరంగా, పాకిస్థాన్ కూడా ట్రంప్ వాదనకు మద్దతు పలుకుతోంది. అమెరికా అనుకూలత పొందేందుకే పాక్ ఈ విధంగా వ్యవహరిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

అయితే, అమెరికా వాదనలను భారత ప్రభుత్వం మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో తమ సైన్యం ధాటికి తట్టుకోలేకే పాకిస్థాన్ కాల్పుల విరమణ కోరిందని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ మూడో దేశం జోక్యం చేసుకోలేదని, దీనికి వాణిజ్య ఒప్పందాలతో ఎలాంటి సంబంధం లేదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గతంలోనే తేల్చిచెప్పారు. అయినప్పటికీ, అమెరికా నేతలు తమ మధ్యవర్తిత్వ పాత్ర గురించే పదేపదే మాట్లాడటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *