ఇంటివద్దే పాఠాలు లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్‌ తరగతులు…!

కరోనా లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులు జోరందుకున్నాయి. లాక్‌డౌన్‌తో విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలు మూతపడగా, వివిధ సెట్స్, పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ఎంతో దోహదపడుతున్నాయి. దీంతో రోజుకు మూడు నాలుగు గంటలు ఆన్‌లైన్‌ తరగతుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు.  నగరంలోని వివిధ  ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు శిక్షణ కేంద్రాలు తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా సాధారణ తరగతి వాతావరణాన్ని కలిపిస్తూ బోధన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. ఎంసెట్, నీట్, జేఈఈ, వంటి ప్రవేశ పరీక్షలతోపాటు గ్రూప్స్, బ్యాకింగ్, సివిల్స్‌ అర్హత పరీక్షలకుఆన్‌లైన్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నాయి.    

దేశంలో ఐఐటీలు, ఏఐసీటీఈ, ఇగ్నో తదితర ఉన్నత శిక్షణ సంస్థల ద్వారా రూపొందించిన   ‘ స్వయం’ ఆన్‌లైన్‌ పోర్టల్‌  విద్యార్థులకు వరంగా మారింది. ‘స్వయం’ ద్వారా వివిధ విద్యాసంస్ధలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు ఆన్‌లైన్‌ కోర్సుల్లో చేరి తమ ప్రతిభను మెరుగుపర్చుకుంటున్నారు. స్వయంతోపాటు ఇతర  ఆన్‌లైన్‌ కోర్సులను అందించే సంస్థలుకూడా ఈ లాక్‌డౌన్‌ సమయంలో మూడు నెలల కాలం ఉచిత శిక్షణకు అవకాశం కల్పించాయి.  ప్రత్యేకంగా ఇంజనీరింగ్‌ విద్యార్థులకు అనేక రకాలైన ఆన్‌లైన్‌ కోర్సులకు సంబంధించి వివిధ సంస్థలు ఉచిత శిక్షణ  ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. ఎన్‌పీటెల్, ముక్,  ఎడెక్స్, యుదాసిటీ, ఉడ్మి, ఖాన్‌ఆకాడమి,టెడ్, అలిసన్, ఫ్యూచర్‌లెర్న్, ఓపన్‌లెర్న్, ఒపన్‌ కల్చర్‌ తదితరాలు  ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణలను అందిస్తున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *