ట్రంప్ టారిఫ్ దెబ్బ.. అమెరికాలో మోతెక్కిపోతున్న ధరలు..!

ట్రంప్ ప్రభుత్వం విధించిన కొత్త సుంకాలు అమెరికాలో సామాన్య ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఒక్కో అమెరికన్ కుటుంబంపై ఏటా సగటున 2,400 డాలర్లు (సుమారు రూ.2.11 లక్షలు) అదనపు భారం పడనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 7 నుంచి ఈ కొత్త టారిఫ్‌లు అమల్లోకి రావడంతో దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

 

దీని ప్రభావం ఇప్పటికే మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. వాల్‌మార్ట్, అమెజాన్ వంటి ప్రఖ్యాత రిటైల్ దుకాణాల్లో వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. పాత ధరల స్టిక్కర్లపైనే కొత్త ధరల స్టిక్కర్లను అతికించి అమ్ముతున్నారు. మెర్సిడెస్ చాండ్లెర్ అనే మహిళ వాల్‌మార్ట్‌లో పెరిగిన ధరల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది. ఒక కోటు ధర 6.98 డాలర్ల నుంచి 10.98 డాలర్లకు, బ్యాక్‌ప్యాక్ ధర 19.97 డాలర్ల నుంచి 24.97 డాలర్లకు పెరిగిందని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. దుకాణంలో ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోందని ఆమె వాపోయారు.

 

భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళనతో, వినియోగదారులు అవసరమైన వస్తువులను ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ఏ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందో తెలుసుకోవడానికి ఏఐ టూల్స్‌ను సైతం ఆశ్రయిస్తున్నారు. రాబోయే రోజుల్లో డైపర్లు, షాంపూలు, స్కిన్‌కేర్ ఉత్పత్తులు, దిగుమతి చేసుకునే మద్యం, కార్లు, వాటి విడిభాగాలు, చైనా నుంచి వచ్చే ఆటబొమ్మల ధరలు కూడా గణనీయంగా పెరగనున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. సగటున ఈ బాదుడు 35 శాతం వరకు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

 

ఈ సుంకాల పెరుగుదల నేపథ్యంలో అమెజాన్, వాల్‌మార్ట్ వంటి దిగ్గజ సంస్థలు తమ దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి సరుకులను పంపవద్దని ఎగుమతిదారులకు సూచించినట్టు సమాచారం. ఈ పరిణామంతో దుస్తులు, టాయ్‌లెట్ పేపర్ నుంచి టూత్‌పేస్ట్, డిటర్జెంట్ల వరకు అనేక వస్తువుల ధరలు ఇప్పటికే పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *