కేరళలోని సాధారణ కుటుంబానికి చెందిన ఓ చిన్నారి ముఖంలో వెలుగులు నింపేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరన్ విజయన్‌తో పాటు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి శైలజ స్పందించిన తీరు కదిలించింది. కేరళనుంచి అంబులెన్స్‌తో పాటు ఇద్దరు డ్రైవర్లను ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు వెళ్ళేందుకు అనుమతి పత్రాలు ఇప్పించడమే కాకుండా ఆ పాప ఆపరేషన్ అయ్యేంత వరకు బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులకు తగిన సూచనలు ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే… కేరళ అలప్పుజకు చెందిన ఎలక్ట్రీషియన్ వినీత్ విజయన్–గోపిక దంపతుల కూతురు అన్విత(21నెలలు) కంటి క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో రెటీనో బ్లాస్టోమా కీమో థెరపీ చికిత్స చేయించుకుంటోంది.
చికిత్సలో భాగంగా బుధవారం ఆమెకు కీలకమైన ఇంట్రా ఆర్టీరియల్ కీమో థెరపి సైకిల్ చేయాల్సి ఉంది. లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కేరళ నుంచి హైదరాబాద్‌కు రావడం ఎంత కష్టమో తండ్రి వినీత్ సోషల్ మీడియాలో తన ఆవేదన వెల్లడించాడు. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఆరోగ్య శాఖామంత్రి స్పందించారు. ఫేస్‌బుక్‌లో చిన్నారి ఎదుర్కొంటున్న బాధను చూసిన కేరళ సమాజం మొత్తం స్పందించింది. ప్రభుత్వం అంబులెన్స్‌తో పాటు ఇద్దరు డ్రైవర్లను ఏర్పాటు చేసి హైదరాబాద్ వెళ్ళేందుకు అనుమతిచ్చారు. బుధవారం చిన్నారికి ఈ వైద్య చికిత్స పూర్తి చేశారు. ఒక వేళ అనుకున్న సమయానికి పాపను తీసుకురాకపోతే ఇప్పటి వరకు తీసుకున్న చికిత్స మొత్తం వృథా అయ్యేదని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి కేన్సర్ సేవల అధిపతి డాక్టర్ స్వాతి కలిగి అన్నారు.