పెరుగుతున్న పెట్రో ధరలకు వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్తంగా ఆందోళనలు

పెరుగుతున్న పెట్రో ధరలకు వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) పిలుపునిచ్చింది. డీజిల్‌, పెట్రోల్‌, వంట గ్యాస్‌ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండు గంటల పాటు దేశం అంతటా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆందోళన కారులు తమ స్కూటర్లు, మోటారు సైకిళ్లు, ట్రాక్టర్లు, కార్లు, బస్సులు, ట్రక్కులు, ఖాళీ గ్యాస్‌ సిలిండర్లతో సహా నిరసన కోసం ఎంపిక చేసిన బహిరంగ ప్రదేశాలకు చేరుకుంటారు. రహదారులకు ఒక వైపున శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించాలని ఎస్‌కెఎం విజ్ఞప్తి చేసింది. రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, దుకాణదారులు, రవాణాదారులు, వ్యాపారులు, ఇతరులు ప్రతిచోటా ఈ నిరసనలలో భాగం కావాలని ఎస్‌కెఎం విజ్ఞప్తి చేసింది. ధరలను వెంటనే సగానికి తగ్గించాలని ఎస్‌కెఎం డిమాండ్‌ చేసింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. బుధవారం నాటికి 223వ రోజుకు చేరింది. ట్రాక్టర్‌ ట్రాలీలు, కార్ల కాన్వారుతో బావల్‌ చౌరాసి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు బుధవారం షాజహాన్‌పూర్‌ నిరసన స్థలానికి చేరుకున్నారు. ఘజీపూర్‌ సరిహద్దుకు ట్రాక్టర్‌ ర్యాలీ కోసం అనేక ఉత్తర ప్రదేశ్‌ జిల్లాల్లో సమీకరణ జరుగుతోంది.
సద్భావనా మిషన్‌
సంయుక్త కిసాన్‌ మోర్చా సింఘూ బోర్డర్‌ నుండి ”సద్భావనా మిషన్‌”ను ప్రారంభించనున్నారు. ప్రతి వారం లో గురువారం, శుక్రవారం, శనివారం, కజారియా టైల్స్‌ వద్ద కిసాన్‌ ఆందోళన కార్యాలయంలో వైద్య నిపుణులచే కంటి శిబిరం నిర్వహించనున్నారు. ప్రతి ఆదివారం ప్రపంచ స్థాయి కార్డియాలజిస్టులు హార్ట్‌ ఎలైమెంట్స్‌ క్యాంప్‌ నిర్వహిస్తారు. టిక్రీ బోర్డర్‌లో ప్రత్యేక కోవిడ్‌ టీకా డ్రైవ్‌ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *