కూటమి సర్కార్ కొత్త నినాదం..! ‘ఆంధ్రా ఈజ్ బ్యాక్’ పేరుతో పరిశ్రమలకు పిలుపు..

ఏపీలో కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగంపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టినట్టు స్పష్టమవుతోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(CII) 30వ భాగస్వామ్య సదస్సుకి ఏపీ సిద్ధమవుతోంది. విశాఖలో ఈ సదస్సు నిర్వహించబోతున్నారు. ఈ సదస్సు విజయవంతం కోసం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం తాజాగా సమావేశమైంది. ‘ఆంధ్రా ఈజ్ బ్యాక్’ అనే నినాదంతో పరిశ్రమలను ఆకర్షించాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. కొత్త పరిశ్రమలు రావడం ద్వారా, మరిన్ని పెట్టుబడులను తేవడం ద్వారా ఏపీలో ఉపాధి, ఆర్థిక రంగ వృద్ధి జరుగుతుందని చెప్పారాయన.

 

పారిశ్రామిక అభివృద్ధి..

సంక్షేమ పథకాల అమలు విషయంలో గత వైసీపీ ప్రభుత్వంపై పెద్దగా ఫిర్యాదులు లేవు, అయితే పారిశ్రామిక ప్రగతి కుంటుపడిందని, పథకాల అమలులో అవినీతి జరిగిందనేవి అతిపెద్ద కంప్లైంట్స్. కొత్త పరిశ్రమలను తీసుకు రాకపోగా, 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేసుకున్నారని, పరిశ్రమలను పక్క రాష్ట్రాలకు తరిమేశారనే అపవాదు జగన్ పై ఉంది. ఈసారి అలాంటి తప్పు జరగకూడదని కూటమి భావిస్తోంది. ఇటీవల సింగపూర్ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం.. గతంలో జరిగిన తప్పుల్ని సరిచేస్తున్నట్టు తెలిపింది. ఏపీలో అభివృద్ధికి సింగపూర్ భాగస్వామ్యం కోరామని చెప్పింది. రాజధాని అమరావతిపై ఫోకస్ చేస్తూనే, మరోవైపు విశాఖను కూడా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. విశాఖలో CII 30వ భాగస్వామ్య సదస్సుని విజయవంతం చేసి, మరిన్ని పరిశ్రమలను ఏపీకి ఆకర్షించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

 

నవంబర్ 14, 15..

నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్ లో CII 30వ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తారు. ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులు ఆకర్షించే విధంగా సదస్సును విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఆంధ్రా ఈజ్ బ్యాక్ అనేది నిర్వహణా రాష్ట్రంగా మన నినాదం కాగా.. ‘టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్: నేవిగేటింగ్ ది న్యూ జియో- ఎకనమిక్ ఆర్డర్’ అనే థీమ్ తో ఈ సదస్సు నిర్వహించబోతున్నారు. ఒక్కో దేశానికి సంబంధించిన ఒక్కో థీమ్ ను సిద్ధం చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం దేశ, విదేశాల్లో రోడ్ షోలు నిర్వహించాలని, పారిశ్రామికవేత్తలకు ఏపీని కేంద్రంగా చేయాలని మంత్రివర్గ ఉపసంఘం తీర్మానించింది. ఇకపై ప్రతి 15 రోజులకోసారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

 

మార్పు చూపించగలిగితేనే..

2019 నుంచి 2024 వరకు ఏపీకి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉపాధి లభించింది అనే విషయాలపై అందరికీ క్లారిటీ ఉంది. కూటమి హయాంలో ఏపీకి కొత్తగా వచ్చిన పరిశ్రమలు, కొత్తగా లభించిన ఉద్యోగాలు అంతకు మించి ఉంటేనే అది ప్రభుత్వ విజయంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఆ విజయాలనే 2029 ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మార్చుకోవాలని చూస్తున్నారు కూటమి నేతలు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రాజధాని అమరావతితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకి ప్రయత్నాలు మొదలయ్యాయి. విశాఖ కేంద్రంగా పారిశ్రామిక సదస్సులు నిర్వహించడంతోపాటు, ఆ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషిచేస్తున్నట్టు స్పష్టమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *