ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ..!

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 9న ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెబుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21న చివరి తేదీగా ప్రకటించింది. 22న నామినేషన్ల పరిశీలన, 25న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. సెప్టెంబర్ 9న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ పేర్కొంది.

 

ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్‌ఖర్ జులై 21న ఆరోగ్య కారణాలతో ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. ఆయన పదవీకాలం వాస్తవానికి ఆగస్టు 2027 వరకు ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మధ్యంతర ఎన్నికల ద్వారా ఎన్నికైన వ్యక్తికి పూర్తి ఐదేళ్ల పదవీకాలం ఉంటుంది.

 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం పార్లమెంటులోని ఉభయ సభల (లోక్‌సభ, రాజ్యసభ) సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికలో ఎంపీలందరూ (ఎన్నికైనవారు, నామినేటైనవారు) పాల్గొంటారు. సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓటు పద్ధతి ద్వారా ఈ ఎన్నికలు రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *