కొవీఢ్-19 లాక్ డౌన్ నేపథ్యంలో బయటి మార్కెట్‌లో తమ పంటలను అమ్ముకోవాలనుకునే రైతులకు పూర్తిగా సహాయ, సహకారాలు అందించాలని సీఎం వైఎస్ జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వారికి రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు మార్కెటింగ్ పరంగా మరింత దూకుడుగా వ్యవహరించి, తోడ్పాటు అందించాలన్నారు. కోవిడ్–19 వ్యాప్తి నివారణ చర్యలు, వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించేందుకు గత రెండు సర్వేలు జరిగిన తీరు తెన్నులు, ఇప్పుడు జరుగుతున్న మూడో సర్వేపై, రైతుల పంటల కొనుగోలు అంశాలపై గురువారం ఉదయం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు కావాలి. అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలి. దీనిపై నిశితంగా సమీక్ష చేయాలి. ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలి: సీఎం వైఎస్ జగన్
► కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం లాక్‌డౌన్ అమలు చేస్తున్నందున పంటల రవాణా, మార్కెటింగ్ పరిస్థితి కష్టంగా ఉంది. 50 శాతం మార్కెట్లు మూత పడ్డాయి. 20 శాతం మార్కెట్లలో కూడా లావాదేవీలు జరగడం లేదు.
► ఇదిలా ఉంటే రవాణా ఇంకో సమస్య. లారీల వాళ్లు రావడం లేదు. కరోనా భయం కావచ్చు.. రోడ్డుపైకి వస్తే పోలీసులు ఆపేస్తారని కావచ్చు.. లోడ్ ఎత్తుకోవడానికి ముందుకు రావడం లేదు. అయినప్పటికీ మనం రైతులకు సహకరించాలి. ఎలాగైనా వారికి గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి.
► ఉత్పత్తి ఉన్న చోటే మార్కెట్ యార్డులను ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు చేయాలి. రైతులను ఆదుకోవడంలో భాగంగా ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల మార్కెట్లో ధరల స్థిరీకరణ జరగాలన్న ఉద్దేశం నెరవేరేలా చూడాలి.