కేటీఆర్, సీఎం రమేశ్ వ్యవహారంపై స్పందించిన రఘునందన్ రావు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ మధ్య చోటుచేసుకున్న పరస్పర ఆరోపణలపై తెలంగాణ బీజేపీ లోక్‌సభ సభ్యుడు రఘునందన్ రావు స్పందించారు. ఈ విషయాన్ని పార్టీలో చర్చిస్తామని ఆయన తెలిపారు. కేటీఆర్, సీఎం రమేశ్ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే.

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం రమేశ్‌కు చెందిన కంపెనీకి వేల కోట్ల ప్రాజెక్టును కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. దీనిపై స్పందించిన సీఎం రమేశ్, తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయనే భయం కేటీఆర్‌ను వెంటాడుతోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రఘునందన్ రావు పై విధంగా స్పందించారు.

 

అంతేకాకుండా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని రఘునందన్ రావు విమర్శించారు. దమ్ముంటే ఈ బిల్లుపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. బీజేపీలో బీసీలకు ప్రాధాన్యత లేదని కాంగ్రెస్ నేతలు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటే అందులో ఒకరు బీసీ ఉన్నారని గుర్తుచేశారు.

 

రాష్ట్రంలో బీసీలు 56 శాతం ఉంటే కేవలం ముగ్గురికే రేవంత్ రెడ్డి కేబినెట్‌లో చోటు దక్కిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేయాలని డిమాండ్ చేశారు. హెచ్‌సీయూ భూముల అంశంలో కేటీఆర్ బట్ట కాల్చి తమపై వేశారని ధ్వజమెత్తారు. తనపై, కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై కేటీఆర్ ఆరోపణలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *